
పార్కులుండనీ, ప్లే గ్రౌండ్స్ ఉండని.. ఇప్పటికీ మనదేశంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్.. సినిమా మాత్రమే. ఎంటర్‌టైన్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ అయినా ఉండనీ.. మొదటి ఆప్షన్ మాత్రం సినిమానే. అందుకేగా సినిమాలన్నీ వీకెండ్స్‌కి, సంక్రాంతి-దసరా వంటి ఫెస్టివల్స్‌కి రిలీజ్ చేసేది. సినిమాకి, సగటు జీవికి మధ్య ఓ విడదీయలేని బంధం ఉంది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకి. రోజంతా కష్టపడి పని చేసి, కాసింత వినోదం కోసం థియేటర్లకు వెళ్తుంటారు. ఎన్ని కష్టాలున్నా, రేపటి గురించి మరిచిపోయి హాయిగా ఆ మూడు గంటల సేపు గడిపేస్తారు. మూడు గంటల టైమ్‌పాస్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. సినిమా అనేది జీవితంలో ఓ భాగం అయిపోయింది. వెళ్లామా, చూశామా, వచ్చేశామా అనేట్టు ఉండదు పరిస్థితి. సినీ నటులపై తమ అభిమానాన్ని పెంచుకున్నారు, చాటుకున్నారు, కొట్టుకున్నారు. అది ఎంత దాకా వచ్చిందంటే సినిమాలో వేషమే అయినా.. ఆ నటీనటులని తమ ఇలవేల్పుగా భావించి, ఓహో రాముడు ఇలా ఉండేవాడేమో, కృష్ణుడు ఇలా ఉండుంటాడేమో, సీత అంటే ఇలాగే ఉండేదేమో.. అని వాళ్లనే దైవాలుగా భావించారు. ప్రేక్షకులకు ఉన్న ఆ అభిమానమే కదా నటులను రాజకీయ దిగ్గజాలను చేసింది. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేదాకా వచ్చింది ఆ సినిమా అభిమానమే. ఎంజీఆర్‌ను సీఎంను చేసింది, జయలలితను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది, లేటెస్ట్‌గా డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌ను కూర్చోబెట్టింది కూడా ప్రేక్షకులకు సినిమా వాళ్లపై ఉన్న ఆ అభిమానమే....