వార్నీ ఇదెక్కడి వింత.. భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్!
ఎక్కడైనా భూమిలో నుంచి వచ్చే నీరు చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం.. చిన్న గుంత తీసినా, బోరు వేసినా, ట్యాప్ ఆన్ చేసినా వేడి నీళ్లే వస్తాయట. అంతేకాదు.. వర్షాకాలం, చలికాలంలో భూమి నుంచి వచ్చే ఆవిరి ఆ ఊరి మొత్తాన్ని కమ్మేస్తుందట. మరి దీనికి కారణం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సాధారణంగా వేడి నీళ్లు కావాలంటే, మంటపై వేడి చేయడమో, లేదా హీటర్ పెట్టడమో, లేదా గీజర్ వాడడమో చేయాలి. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం.. ఎవరికీ గీజర్లు వాడాల్సిన అవసరం లేదట.. ఎందుకంటే ఆ గ్రామంలో ఏ ట్యాప్ తిప్పినా.. బోర్ ఆన్ చేసినా అందులోంచి వచ్చేవన్నీ వేడి నీళ్లేనట. అవును, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఈ వింతను మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు మూడు చోట్ల ఇలా భూమిలోంచి వేడి నీరు ఉబుకుతోందట.
అంతేకాదు ఈ గ్రామంలో వర్షాకాలం, లేదా చలికాలం వచ్చిందంటే.. ఊర్లోని కాలువల్లోని వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి.. గ్రామం మొత్తాన్ని కమ్మేస్తుందట. ఈ గ్రామస్తులు కూడా ఆ వేడి నీటినే స్నానాలు చేసేందుకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారట. అయితే ఈ గ్రామంలో భూమిలోంచి వేడి నీరు ఎందుకు వస్తున్నాయనేది చూస్తే.. ఆ ప్రాంతంలో భూమి లోపల ఎక్కువగా బొగ్గు గనులు ఉన్నాయట. ఆ గనుల నుంచి వచ్చే వేడి కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి నుంచి వేడి నీరు వస్తున్నాయని స్థానికులు చెబుతున్న మాట.
అయితే ఇది కొన్ని రోజులు ఉండే తంతు కాదు.. ఈ పరిసర ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఇలానే వేడి నీళ్లు వస్తాయట.. వాతావరణం కూడా అదే తరహాలో కనిపిస్తుందట. తాజాగా గురువారం వర్షం పడి ఆగిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న ఓ పంపు నుంచి వేడి నీరు రావడంతో ఓ మహిళ వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
