నేటి నుంచి భూ భారతి అమలు..! గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నారు. జూన్ 13 నుండి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రైతులు తమ సమస్యలను సంబంధిత ఫారాల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు.

నేటి నుంచి భూ భారతి అమలు..! గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు
Telangana Bhu Bharathi

Updated on: Jun 03, 2025 | 10:11 AM

గ్రామస్తులు ఊరు దాటక్కర్లేదు. కాలు కదపక్కర్లేదు. రెవెన్యూ అధికారులే మీ గడప దగ్గరకు వస్తారు. భూ భారతితో మీ భూ సమస్యలను పరిష్కరిస్తారు. అవును.. ఇవాల్టి నుంచి చలో పల్లెటూరు అంటోంది తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌. ప్రజల దగ్గరకే రెవెన్యూ అధికారులు వెళ్లి, భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు తీసుకుంటారు. మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందున్న ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఇప్పటికే 4 మండలాల్లో భూ భారతి పైలెట్‌ ప్రాజెక్ట్‌ నిర్వహించారు. ఇక ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళ్తుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు.

ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. ఇక దీని కోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు. గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి గ్రామాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు రెవెన్యూ అధికారులు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు.  భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూన్ 20 తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..