ప్రజాపాలన వెబ్సైట్లో సరికొత్త అప్డేట్ వచ్చేసింది. లబ్దిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేలా దీనిని రూపొందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు, మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత ఏడాది డిశంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకూ కొనసాగింది. ఇందులో భాగంగా కోటికిపైగా దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వాటిని కంప్యూటరైజ్ చేస్తున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 1,25,84,383 దరఖాస్తులను డేటా ఎంట్రీ చేస్తున్నారు. దాదాపు 70శాతం వివరాల నమోదు ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుల కారణంగా పని కొంత జాప్యం జరిగినప్పటికీ మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ కానుంది.
అయితే ఈ క్రమంలోనే ప్రజాపాలన వెబ్ సైట్ అప్డేట్ అయినట్లు తెలుస్తోంది. https://prajapalana.telangana.gov.in/applicationstatus అని లాగిన్ అయితే చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తోంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ వివరాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది. మొన్నటి వరకూ వెబ్ సైట్ మాత్రమే అందుబాటులోకి రాగా తాజాగా స్టేటస్ చెక్ కనిపించడంతో పనిలో పురోగతి సాధిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఈ స్టేటస్ చెకింగ్ లో భాగంగా మనకు కేటాయించిన అప్లికేషన్ నంబర్ నమోదు చేస్తే మన దరఖాస్తు స్థితి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఇది సాంకేతికంగా ఎర్రర్ చూపిస్తోంది. రానున్న రోజుల్లో మంచిగా అప్డేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అలాగే మనం ఎన్ని పథకాలకు అర్హులమో కూడా తెలిసిపోతుంది. దీంతో పాటు మనం ఇచ్చిన వివరాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా.. ఇంకా ఎలాంటి వివరాలు అధికారులకు అందించాలి అనే అంశాలు కూడా కనిపించేలా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకూ అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డులు, రైతు భరోసా, మహాలక్ష్మి పథకాలకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో పూర్తిస్థాయి డేటా ఎంట్రీ చేసి సరికొత్తగా అప్డేట్ చేయనున్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని చెబుతున్నారు మంత్రులు. మరో నాలుగు నెలల తరువాత తిరిగి ప్రజాపాలన దరఖాస్తు సేకరణ కార్యక్రమం చేపడతామని చెబుతున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..