తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజుల వ్యవధిలో దాదాపు 5 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగినట్లు రాష్ట్ర వ్యవశాయ శాఖ తెల్పింది. మరోవైపు బాణుడి భగభగల నుంచి రాష్ట్రవాసులకు కొంత ఉపశమనం కలిగినట్లైంది. గురువారంనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 40.2, నల్లగొండలో 37.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇక రానున్న మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండ్రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం నాడు సంగారెడ్డి జిల్లా మోగ్దాంపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.