
ఓ వైపు చలితో వణికిపోతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర మరోషాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్టు పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంకకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో కొనసాగుతున్న చక్రవాత తుఫాన్ దిత్వా శనివారం ఉదయం 8.30 సమయానికి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం అక్షాంశం 9.6°N, రేఖాంశం 80.7°E దగ్గర, జాఫ్నా (శ్రీలంక)కు తూర్పున 80 కి.మీ., వేదారణ్యం (భారతదేశం)కు ఆగ్నేయంగా 140 కి.మీ., కరైకల్ (భారతదేశం)కు దక్షిణ-ఆగ్నేయంగా 170 కి.మీ., పుదుచ్చేరి (భారతదేశం)కు దక్షిణ-ఆగ్నేయంగా 280 కి.మీ. చెన్నై (భారతదేశం)కు దక్షిణంగా 380 కి.మీ. దూరంలో కొనసాగుతుంది.
రానున్న కొన్ని గంటల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ 30 నవంబర్ తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది.ఈ చక్రవాత తుఫాన్ శనివారం అర్ధరాత్రి నాటికి తమిళనాడు తీర ప్రాంతం నుండి కనీస దూరం 60 కి.మీ., ఆదివారం 30 నవంబర్ తెల్లవారుజామున 50 కి.మీ. సాయంత్రం నాటికి 25 కి.మీ. దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది.
ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం.. తెలంగాణలో శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని కొన్నిజిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ, తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.