
వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మైనర్లతో పాటు వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 199 ప్రకారం.. మైనర్ వాహనం నడిపినట్లు తేలితే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఆ మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబోమని వెల్లడించారు. గత ఏడాది మైనర్లకు వాహనాలు ఇచ్చిన కేసుల్లో 4,070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది.
పిల్లల భద్రతతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు ఇతర చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం మైనర్లు వాహనాలు నడపడం ఆందోళనకరంగా మారింది. కొందరు ఇద్దరు, ముగ్గురు కలిసి బైక్‌లపై స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్లు పూర్తి చేసిన వారికే డ్రైవింగ్‌కు అర్హత ఉంటుంది. అయితే, పదో తరగతి చదివే వయస్సులోనే చాలామంది బైక్‌లు నడుపుతూ రోడ్లపై నిర్లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. తాజాగా తెలంగాణ రవాణా శాఖ కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించింది.