Khelo India Games: తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు జరగబోతున్నాయంటే?

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహణకు సన్నాహాలు ఇకనుండి ముమ్మరంగా సాగనున్నాయి. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో 8వ ఖేలో ఇండియా యువ క్రీడలు జరగనున్నాయి. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల్లో మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

Khelo India Games: తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు జరగబోతున్నాయంటే?
Khelo India Youth Games 2026 In Telangana

Edited By:

Updated on: Oct 04, 2026 | 4:26 PM

ఈ సారి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు తెలంగాణ ఆథిత్యం ఇవ్వబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. వీటిలో దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు, 1,500 మంది సహాయక సిబ్బంది, 1,000 మందికి పైగా సాంకేతిక అధికారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. అయితే రాష్ట్రంలో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడంపై సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వస్తున్నారు. రాష్ట్రానికి ఒలింపిక్ పతకాలు సాధించే స్థాయిలో క్రీడా వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2025 ఆగస్టు 2న తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025ను ఆవిష్కరించారు. తెలంగాణను ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చడంతో పాటు యువతను క్రీడల వైపు ఆకర్షించడమే ఈ విధానం లక్ష్యంగా చెబుతున్నారు.

ఆధునిక క్రీడా మైదానాలు, మెరుగైన శిక్షణ సదుపాయాలు, డిజిటల్ ఫిట్‌నెస్ కార్యక్రమాలతో క్రీడా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (వైఐపీఈఎస్యూ) వంటి సంస్థలకు ప్రాధాన్యం ఇస్తోంది.

సీఎం ఢిల్లీ పర్యటనల్లోనూ క్రీడ‌ల ప్రస్తావనే!

తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళిన విష‌యం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయతో ఈ అంశంపై ప్ర‌త్యేకంగా మాట్లాడిన విష‌యం విదిత‌మే. సీఎం ప్రత్యేక చొరవతోనే రాష్ట్రానికి ఖేలో ఇండియా క్రీడల ఆతిథ్యం దక్కినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

డిసెంబర్‌లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు రోయింగ్‌ను ఆతిథ్య క్రీడగా ఎంపిక చేశారు. సెయిలింగ్‌ను ప్రదర్శన క్రీడగా నిర్వహించనున్నారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తారు. మిగిలిన పోటీలు హైదరాబాద్‌లో జ‌రిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేర‌కు అధికారులు నిర్వహ‌ణ‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.

గచ్చిబౌలి స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, సరూర్‌నగర్, జేఎన్‌టీయూహెచ్, సికింద్రాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలు, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాలను పోటీలకు ప్రణాళికలు సిద్ధం చేశారు, రాబోయే రెండు నెలలు ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. హుస్సేన్‌సాగర్ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంలో రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ పోటీలు నిర్వహించనిండడం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

ఐదు కమిటీల ఏర్పాటు

రాష్ట్రంలో ఘ‌నంగా క్రీడల నిర్వహణ కోసం ఐదు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్గనైజింగ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా, కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు, అతిథుల వసతి, భోజనం, రవాణా ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లోని 10 క్రీడా వేదికల్లో 12 అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. క్రీడాకారుల గదులు, ప్రేక్షకుల సౌకర్యాలు, మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్స్, సైక్లింగ్ ట్రాక్‌లు, షూటింగ్ రేంజ్‌లను మెరుగుపరచనున్నార. డిసెంబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉంది. డిసెంబర్ 22న ఎల్‌బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

యువ క్రీడాకారులకు పెద్ద వేదిక

దేశవ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను వెలికితీయడం, గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడం ఖేలో ఇండియా క్రీడల ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాల మధ్య జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు సాధించే పతకాలు ఆయా రాష్ట్రాల ఖాతాలో చేరతాయి. అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రం విజేతగా నిలుస్తుంది. 2024, 2025 క్రీడల్లో మహారాష్ట్ర విజేతగా నిలిచింది.

ప్రధాన క్రీడాంశాలు

ఈ గేమ్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, జూడో, ఖో-ఖో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి క్రీడలతో పాటు. సాంప్రదాయ క్రీడలైనా గట్కా, మల్లఖంబ్, కలరిపయట్టు, థాంగ్-టా, యోగాసనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us