
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం (జూన్ 14) నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు సోమవారం తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడులైన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తప్పిన విద్యార్ధులతోపాటు బెటర్‌మెంట్ కోసం మొత్తం 93,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి రోజు పరీక్షకు 84,835 మంది హాజరయ్యారు. ద్వితీయ ఏడాది పరీక్షలకు 31,298 మందికిగాను 27,359 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.