Telangana: కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ

బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ.. కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వేములవాడ టికెట్‌ విషయంలో BJPలో ఆఖరు నిమిషం వరకూ హైడ్రామా కొనసాగింది. ముందు తుల ఉమ పేరు ప్రకటించినా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని చెన్నమనేని వికాస్‌ రావుకి ఇచ్చారు. దీంతో ఉమ మనస్తాపానికి గురయ్యారు. పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

Telangana: కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ
KTR - Tula Uma

Updated on: Nov 13, 2023 | 4:35 PM

భారతీయ జనతా పార్టీ నాయకురాలు, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ నవంబర్ 13, సోమవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చివరి నిమిషంలో బీజేపీ అధిష్ఠానం కొన్ని స్థానాలకు అభ్యర్థులను మార్చడంతో టికెట్‌ దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేములవాడలో ముందుగా తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించి..ఆ తర్వాత బీఫామ్‌..చెన్నమనేని వికాస్‌రావుకు ఇచ్చారు. దీన్ని అవమానంగా భావించిన ఉమ.. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నామని చెబుతున్న బీజేపీ..ఇలా చేస్తుందని ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ అధిష్ఠానంపై ఫైరయ్యారు. బీజేపీ బీసీ, మహిళా నినాదం ఒట్టి బోగసేనన్న విషయం తేలిపోయిందన్నారామె. ఇది ఓ బీసీ బిడ్డకు జరిగిన అన్యాయమంటూ ఆమె బీజేపీకి రాజీనామా చేశారు.

ప్రస్తుత బీజేపీ వేములవాడ అభ్యర్థి, వికాస్… మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు. ఈ పరిణామాల మధ్యనే వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని వేములవాడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ కూడా ఉమను సంప్రదించారు. కానీ ఆమె బీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వేములవాడ నుంచి చల్మెడ లక్ష్మీనరసింహారావు పోటీలో ఉన్నారు. తుల ఉమ సహా మరికొందరి చేరికతో స్థానికంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

గతంలో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమె గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున వేములవాడ టిక్కెట్టు ఆశించారు. కానీ చివరి నిమిషంలో హ్యాండిచ్చింది. చివరికి తాను గతంలో పని చేసిన బీఆర్ఎస్ గూటికే తిరిగి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్‌ ఒత్తిడి మేరకే తుల ఉమకు వేములవాడ బీజేపీ టికెట్ దక్కిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె బీజేపీని వీడి గులాబీ కండువా కప్పుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.