చార్మినార్ టు ఫ్యూచర్​ సిటీ వరకు.. అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్​

దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ కంపెనీలతోపాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశమవుతూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సాధిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చార్మినార్ టు ఫ్యూచర్​ సిటీ వరకు.. అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్​
Telangana Means Business In Davos

Edited By: Balaraju Goud

Updated on: Jan 22, 2025 | 4:38 PM

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. “తెలంగాణ మీన్స్ బిజినెస్” అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది.

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటిచెప్పేలా ఈ పెవిలియన్ ను అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్‌ నగరానికి ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలను కళ్లకు కట్టించేలా బ్యాక్ గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు.

వరల్డ్ క్లాస్ తెలంగాణ

తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఈ పెవిలియన్ లో పొందుపరిచారు. దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వర్క్, ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, దేశ విదేశీ ప్రయాణీకులకు అనువైన అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డుతో మెరుగైన రవాణా సదుపాయాలను ఇందులో ప్రస్తావించారు.

పవర్ హౌజ్ ఆఫ్ టాలెంట్

తెలంగాణలో నైపుణ్యాలకు కొదవలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవెలప్‌మెంట్‌కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చాటుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలోనే మొట్ట మొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు18 రంగాలకు చెందిన వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రపంచ స్థాయి నైపుణ్యాలపై యువతకు శిక్షణను అందిస్తోంది. వీటితో పాటు ఐఎస్ బీ, ఐఐఐటీ, నల్సార్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలను ఈ జాబితాలో ప్రస్తావించారు.

అభివృద్ధి విధానాలు

తెలంగాణలో పెట్టుబడులకు ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను ఇందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల విధానంతో పాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్, లైఫ్ సైన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇంధన రంగాల అభివృద్ధికి ప్రోత్సహకాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన అనుమతులకు సులభమైన సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఇందులో ప్రస్తావించారు.

దేశంలోనే నివాసయోగ్యమైన నగరం

దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలు అందుబాటులో ఉన్న అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్. చారిత్రకంగా సాంస్కృతికంగా వారసత్వంగా హైదరాబాద్ సిటీకి ప్రాధాన్యతలు, ఇక్కడి కళా సంపదను ప్రచారం చేయటంతోపాటు గ్రేటర్ సిటీ అభివృద్ధికి ఉన్న భవిష్యత్తు లక్ష్యాలను ఇందులో విశ్లేషించారు. భద్రతతో పాటు తక్కువ జీవన వ్యయం ఉన్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలిచింది.

అధునాతనంగా ఫోర్త్ సిటీ

హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఎదిగిన తీరును చార్మినార్ తో పాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ.. అధునాతన ఫ్యూచర్ సిటీ నమూనాను తలపించే వాల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ 14 వేల ఎకరాల్లో విస్తరిస్తుందని, అందులో 6000 ఎకరాల్లో అటవీ పరిరక్షణ ఎకో జోన్ ఉంటుందని.. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తు విజన్ను ఇందులో పొందుపరిచారు. ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ టూరిజం, మరియు ఎకో-టూరిజం వంటి ప్రత్యేక జోన్లతో “వర్క్, లైవ్, లెర్న్, ప్లే” కాన్సెప్ట్ పై ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..