MLC Election Results : పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలతో మాంచి జోరుమీదున్న తెలంగాణ కమలనాధులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఖంగుతినిపించాయి. పోటీచేసిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులు అపజయాలు చవిచూడ్డం తెలంగాణ బీజేపీ నేతల స్పీడ్ కు బ్రేకులు వేసినట్టైంది. హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆపార్టీ కోల్పోవడం తెలంగాణ బీజేపీ నేతలకు ఏమాత్రం మింగుడుపడ్డంలేదు.
అదీ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్దామని భావిస్తున్న కమలం పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరుత్సాహాన్ని మిగిల్చాయనే చెప్పాలి. అటు, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా తయారయ్యాయి. రెండు ఎమ్మెల్సీ ఫలితాల్లోనూ కనీసం అజాపజా లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పోవడం టీ కాంగీలకు ఏ మాత్రం మింగుడుపడకుండా ఉంది.