Telangana Ministers Warangal tour: కష్టం కళ్లముందే ఆవిరైంది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట నీటిపాలైంది. ఉమ్మడి వరంగల్‌లో వడగళ్ల వానలు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. బాధిత రైతుల్ని పరామర్శించిన తెలంగాణ మంత్రులు.. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఎటుచూసినా వరద.. కనుచూపు మేర కడగండ్లు.. ఇదీ వరంగల్ రైతుల దుస్థితి. ఎండనక.. వాననక కష్టించి పండించిన పంట చేతికందకుండా పోయింది. వడగళ్ల వాన ప్రభావంతో నష్టపోయిన పంటల్ని పరిశీలించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి. పరకాల, నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రుల పర్యటన కొనసాగింది. పంట నష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. దెబ్బతిన్న పంటల తీవ్రతను అంచనా వేశారు మంత్రులు. మంత్రుల్ని చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించారు బాధిత రైతులు. పంట నష్టపోయిన ప్రతీ రైతునూ ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రులతో కలిసి రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, MLAలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొదన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మిర్చికి భారీగా నష్టం జరిగిందన్నారు. బాధితులందరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా, మొత్తంగా అకాల వర్షం కారణంగా లబోదిబోమంటున్నారు అన్నదాతలు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌లో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాల వల్ల జరిగిన పంటనష్టాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. దీంతో కేసీఆర్.. తానే స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి జరిగిన పంటనష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్పినట్టు తెలిసింది. అలాగే బాధిత రైతులతో మాట్లాడుతారని, పరిహారం చెల్లింపులో భరోసా ఇచ్చేలా సీఎం పర్యటన ఉంటుందని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా మంత్రివర్గ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Read Also…. Tirumalaiah: నిస్వార్ధం, మొక్కవోని దీక్ష ఆయన సొంతం.. గ్రామాభివృద్ధికి సొంత భూములు ఇచ్చిన మాజీ సర్పంచ్!