Rythu Bandhu Scheme in Telangana: తెలంగాణాలో వారం రోజులపాటు రైతు బంధు సంబరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్బంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ సర్కార్ తెలిపింది. కోవిడ్ నిబంధనలకు నేపథ్యంలో పరిమితులను గుర్తుంచుకొని సంబరాలు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 10 తేదీ వరకు నిర్వహించి ముంగింపుసంబరాలు ఘనంగా చేపట్టాలని సూచించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిముందు రైతు బంధుకు సంబంధించి ముగ్గులు వేయడం, విద్యార్ధులకు ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు.
మరోవైపు, రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలుకు నిధుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఐదో రోజున రైతు బంధు కోసం రూ.1047.41 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. వీటిని 4,89,189 మంది రైతుల ఖాతాలల్లో జమ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5294.09 కోట్లు పంపిణీ చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. 20,30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఒకప్పుడు తెలంగాణలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి వుండేదన్నారు. స్వరాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో రైతులంతా సగర్వంగా తలెత్తుంకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని చెప్పారు. రూ.50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు వంటి ఒక పథకం కింద రైతులకు అందజేయడం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగలేదని అన్నారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమన్నారు. రైతుభీమా, ఉచితకరంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం ఏటా 60 వేల కోట్లు ఈ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని అన్నారు.వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును నిలబెట్టిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.