KTR Letter: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ.. ఎందుకోసమంటే..?

|

Jan 23, 2022 | 7:55 PM

టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. కేంద్రానికి లేఖ రాశారు. రాబోయే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

KTR Letter: కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ.. ఎందుకోసమంటే..?
Ktr Letter To Nirmala Sitharaman
Follow us on

KTR Letter to Nirmala Sitharaman: టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. కేంద్రానికి లేఖ రాశారు. రాబోయే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల గురించి అంశాల వారీగా లెటర్‌లో వివరించారు.

తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు భవిష్యత్‌ ప్రణాళికల కోసం.. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి కేటీఆర్‌. దీనికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు.
వినూత్నమైన విధానాలతో పారిశ్రామికంగా అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహాయం అందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లను గుర్తించిందని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగమైన హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ అభివృద్ధికి అవసరమైన ఆర్థికసాయాన్ని సత్వరమే అందజేయాలని తెలిపారు.

తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి.. ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్‌ కారిడార్లకు… హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జహీరాబాద్ నోడ్‌ల అభివృద్ధికి ఆరు వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రెండు ఇండస్ట్రియల్ కారిడార్లకూ రూ.1500 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు.

కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్లలో హైదరాబాద్ ను చేర్చాలని.. ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో కోరారు కేటీఆర్‌. ఉన్నత విద్యాసంస్థలతోపాటు అద్భుతమైన మానవ వనరులతో.. డిఫెన్స్ , ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక ఆర్థిక సహాయం కింద 5వేల3 కోట్ల రూపాయల నిధుల్ని రాబోయే బడ్జెట్‌లో కేటాయించాలని.. కేటీఆర్‌ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను కూడా చేర్చాలని నిర్మలా సీతారామన్ ను తన లేఖలో కోరారు. ఈ నెల 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ కు ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు కేటీఆర్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.


Read Also… Netaji Statue: నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ