Trs vs Bjp: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. కృష్ణా నదిలో నీటి వాటా తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వాగుతున్న బీజేప నేతలు.. నీటి పంపకాలు తేల్చేలా కేంద్రాన్ని ఒప్పంచాలని సవాల్ విసిరారు. సోమవారం నాడు.. నారాయణపేటలో నిర్వహించిన ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. నీటి పంపకాలు తేల్చాలని కేంద్రాన్ని ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 575 టీఎంసీల నీళ్లు కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నామని, సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్రాన్ని అడిగారని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల నుంచి ఇదే అంశంపై అనేకసార్లు అడుగుతున్న దున్నపోతు మీద వానపడినట్లు బీజేపీలో కనీస చలనమే లేదన్నారు. పైగా సిగ్గులేకుండా ఆ పార్టీ నేతలు కారుకూతలు కూస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
బీజేపీ నేతలకు నిజంగా పాలమూరు మీద ప్రేమ ఉంటే.. ఆ పార్టీ నేతలకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే పాలమూరుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. కృష్ణా నదిలో 575 టీఎంసీల నీళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా తో ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. కృష్ణా నుంచి వికారాబాద్ వరకు, గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ అడుగుతున్నామని, అది పట్టించుకోవడం లేదు గానీ.. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
అభివృద్ధి ఊసేత్తకుండా.. కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు ఇంత వరకు ఒక్క పైసా ఇవ్వలేదని కేంద్రం తీరును ఎండగట్టారు. ఒక్క జాతీయ విద్యా సంస్థను కూడా ఇవ్వలేదన్నారు. యాత్రలు చేస్తూ బుకాయిస్తున్నారని తూర్పారబట్టారు. ఓవైపు రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వొద్దని, మీటర్లు పెట్టాలని చట్టం తీసుకొచ్చారు.. మరోవైపు రైతుల కోసం ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి. వ్యవసాయ క్షేత్రాల్లో మీటర్లు పెట్టకుంటే రూ.25 కోట్ల నిధులు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని, అయినా వెనక్కి తగ్గబోమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక చేనేతపై పన్నులు వేసిన ఘనత బీజేపీదే అని విమర్శించారు మంత్రి కేటీఆర్.
గ్రూప్ 1 పరీక్షలను ఉర్దూలో అనుమతించొద్దని విద్యార్థులను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో లేని అభ్యంతరం.. ఇక్కడ మీకెందుకు వస్తుందని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇక పథకాల్లోని డబ్బులన్నీ తమవే అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. నాతో కర్ణాటకకు రావాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఉన్నాయా? లేదా? చూద్దామన్నారు. కేవలం అసత్యాలు చెబుతూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు జాతీయ పార్టీలు నీతి లేని పార్టీలని, మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.