Minister KTR: కేంద్ర ప్రభుత్వం పేదల ప్రజలను దోచి కార్పొరేట్లకు ధారదత్తం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తలా తోక లేనిదన్నారు. కార్పొరేట్లకు వత్తాసు పలికేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైతులపై ఏ మాత్రం ప్రేమలేని ప్రభుత్వమని విమర్శించారు. వరి కొనుగోళ్లపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీకి మంత్రులు వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిశారని కేటీఆర్ గుర్తు చేశారు. .కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను ఇంతకు ముందుకూడా కలిశామన్నారు. యాసంగిలో వడ్లు వేయొద్దని రైతులకు చెప్పామన్న కేటీఆర్.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించామన్నారు. ప్రతీ ఏటా వడ్డు కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు. కనీసం ఆహార భద్రత కింద ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర బీజేపీ నేతల మానసిక పరిస్థితిపై అనుమానాలొస్తున్నాయన్న కేటీఆర్.. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలో మాట మాట్లాడుతన్నారన్నారు. ధాన్యం ఏదైనా కేంద్రం కొంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతంలో ఇచ్చిన మాట తప్పారన్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ కరెక్టా? సిల్లీ బీజేపీ నేతలు కరెక్టా? వడ్లు కొంటారా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా వన్ నేషన్, వన్ రేషన్ ఉన్నప్పుడు..ధాన్యం విషయంలో పంజాబ్‌కో విధానం? తెలంగాణకో విధానమా? అని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరముందన్నారు. ఎంత ధాన్యమైనా కొంటామని కేంద్రమంత్రి గతంలోనే హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్రంపై పోరుకు సిద్ధమన్నారు. తెలంగాణలోని ప్రతి గింజ కొనుగోలు చేసేంతవరకు ఉద్యమిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
వరి కొనుగోళ్ల వ్యవహారంపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది.
ఎల్లుండి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతులను అవమానించినందుకు నిరసనగా ఆందోళనలు చేపడతామని, ఈ నెల 6న జాతీయ రహదార్లపై రాస్తారోకో చేపడతామన్నారు. విజయవాడ, ముంబై, బెంగళూరు హైవేలపై రాస్తారోకోలు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 7న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసలు చేపడతామన్నారు. 8న ప్రతీరైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చలో ఢిల్లీ కార్యక్రమంలో ఢిల్లీ వెళతారని ప్రకటించారు.
ఉద్యమ కార్యాచరణ