Minister Harish Rao: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించలేకపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో మిషన్ భగరీథ ద్వారా ఇది సాధ్యపడిందన్నారు. ఫలితంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధితుల సంఖ్య తగ్గిందన్నారు. డయాలసిస్ సమస్యలకు తాగునీరు కూడా కారణమన్న హరీష్ రావు.. సమస్య వచ్చాక ట్రీట్‌మెంట్ అందించడం కంటే రాకుండా చేయడమే గొప్పతనమన్నారు. డయాలసిస్ పేషెంట్స్ కోసం ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో భగవానీ మహావీర్ ఫౌండేషన్ 10 మిలియన్ల డయాలిసిస్‌లు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వహకులను ఆయన అభినందించారు.
అంతకు ముందు వైద్య రంగంపై కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్యసేవలను చేర్చామన్నారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. వైద్యరంగానికి మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన తెలపారు. రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3.43 కోట్ల వాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందన్నారు. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. పీహెచ్‌సీల నుంచి జిల్లా మెడికల్ కాలేజీల వరకు తనిఖీలు చేస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు.