Etela Rajender: మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్..

|

May 02, 2021 | 11:12 PM

రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్త్ రఫ్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

Etela Rajender: మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్..
Etela Rajender
Follow us on

Etela Rajender: రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్త్ రఫ్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈటెలను బర్తరఫ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

గత రెండు రోజులుగా మంత్రి ఈటెల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడం.. వాటి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. తరువాత మంత్రి ఈటెల పోర్ట్ ఫోలియో తొలగించడం వంటి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈరోజు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటన వెలువడటం గమనార్హం.

ఇదీ జరిగింది..

మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట పరిధిలో మంత్రి ఈటెల భూఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మెదక్‌ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు విచారణ చేశారు. తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈ సర్వ్ సాగింది. ఈటెలకు చెందిన హ్యాచరీస్‌ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే నిర్వహించారు. తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, మాసాయిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. ఈ భూముల్లో అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పిన కలెక్టర్‌ దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను సీఎస్‌కు అందించారు.

ఈటెలపై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శనివారం ఆయన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్య శాఖను ప్రభుత్వం తప్పించింది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటలను తప్పించాలంటూ గవర్నర్‌ తమిళిసైకు సీఎం సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ తరువాత ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రే స్వయంగా చూస్తారని చెప్పారు. వెంటనే ఆయన ఆ శాఖపై రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే, ఈరోజు అకస్మాత్తుగా ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

Also Read: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం.. 18,449 ఓట్లతో నోముల భగత్‌ గెలుపు

నాది పట్టాభూమి కాదని నిరూపిస్తే మొత్తం ఆస్తినంతా రాసిస్తా.. బండి సంజయ్‌కి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌