ఉపాది హామీ కూలీలకు కొత్త టెన్షన్.. గుండు చేసుకుంటే గుర్తుపట్టిని యాప్.. చివరకు ఏం చేశారంటే?

సాంకేతికత ఎంత పెరిగినా కొన్నిసార్లు అది తెచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ వెలుగు చూసింది. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఫేస్‌రికగ్నైజేషన్ ఇప్పుడు కూలీలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కుబడి కోసం గుండు చేయించుకున్న కూలీలను యాప్ గుర్తించకపోవడంతో, వారు హాజరు కోసం విగ్గులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉపాది హామీ కూలీలకు కొత్త టెన్షన్.. గుండు చేసుకుంటే గుర్తుపట్టిని యాప్.. చివరకు ఏం చేశారంటే?
Mgnregs Attendance App Glitch

Edited By:

Updated on: Jun 03, 2026 | 3:27 PM

ఉపాధి హామీ పథకంలో సాంకేతికతతో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వ్యవస్థ కొన్నిసార్లు విచిత్ర పరిస్థితులకు దారితీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొన్న తాజా ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. వేములవాడ రాజన్న స్వామికి మొక్కు చెల్లించి గుండు చేయించుకున్న కూలీలను బయోమెట్రిక్ యాప్ గుర్తించకపోవడంతో, వారు పనికి హాజరైనా హాజరు నమోదు కాలేదు.

వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాకు చెందిన నలుగురు ఉపాధి హామీ కూలీలు ఇటీవల వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించి గుండు చేయించుకున్నారు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చిన కూలీలు మరుసటి రోజు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. అయితే హాజరు నమోదు చేసే సమయంలో ముఖ గుర్తింపు ఆధారంగా పనిచేసే ఎన్ఎంఎంఎస్ (NMMS) యాప్ వారి ముఖాలను గుర్తించడంలో విఫలమైంది.

పలుమార్లు ప్రయత్నించినా యాప్ స్పందించకపోవడంతో కూలీలు ఆందోళన చెందారు. హాజరు నమోదు కాకపోతే ఆ రోజు కూలి కోల్పోయే పరిస్థితి ఉండటంతో, సమస్యను అధిగమించేందుకు వినూత్న మార్గాన్ని ఆశ్రయించారు. పాత ఫొటోలో ఉన్నట్లుగా కనిపించేందుకు తలకు విగ్గు కప్పుకొని యాప్ ముందు నిలబడగా, వెంటనే యాప్ వారిని గుర్తించి హాజరును నమోదు చేసింది. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.

గుండు చేయించుకోవడం, గడ్డం తీసేయడం లేదా రూపంలో స్వల్ప మార్పులు వచ్చినప్పటికీ యాప్ వ్యక్తిని గుర్తించలేకపోవడం వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం సాంకేతికతను వినియోగించడం మంచిదేనని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా జరిగే ఇలాంటి రూప మార్పులను కూడా గుర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునికంగా అప్‌డేట్ చేయాలని కూలీలు కోరుతున్నారు.

మొత్తానికి కూలీల హాజరు నమోదు కోసం తీసుకొచ్చిన సాంకేతిక వ్యవస్థ, గుండు చేయించుకున్న వారిని గుర్తించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విగ్గు పెట్టుకుంటేనే యాప్ గుర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే, వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us