Telangana BJP candidates: పంతం నెగ్గించుకున్న ఈటల రాజేందర్.. మల్కాజ్‌గిరి టికెట్ ఆయనకే..

|

Mar 02, 2024 | 7:42 PM

BJP Candidates List: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మందికి చోటు దక్కింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన మల్కాజిగిరి సీటును మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఖరారు చేశారు. ఈ స్థానం కోసం ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పోటీపడ్డారు.

Telangana BJP candidates: పంతం నెగ్గించుకున్న ఈటల రాజేందర్.. మల్కాజ్‌గిరి టికెట్ ఆయనకే..
Etela Rajender
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మందికి చోటు దక్కింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మల్కాజిగిరి సీటును మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దక్కించుకున్నారు. ఈ స్థానం కోసం ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పోటీపడ్డారు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి ఈటల రాజేందర్ ఆ సీటును దక్కించుకున్నారు. నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటును ఈటల రాజేందర్ పట్టుబట్టి మరీ సాధించారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యంవహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక.. రేవంత్ రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో పరాజయం తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే రీతిలో మొన్నటి ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన ఈటల రాజేందర్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖరారు..

అలాగే తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ సీటు ఖరారు చేసింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను కిషన్‌రెడ్డికి, కరీంనగర్‌ టికెట్ బండి సంజయ్‌, నిజామాబాద్‌ సీటును అర్వింద్‌కు ఖరారు చేశారు. శుక్రవారంనాడు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీ తీర్థంపుచ్చుకున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు.. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్న  జహీరాబాద్‌ టికెట్ ఖరారు చేశారు. హైదరాబాద్‌‌ నుంచి మాధవీలత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని బరిలో నిలుపుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బూర నర్సయ్య గౌడ్‌‌ ఈ సారి బీజేపీ టికెట్‌పై అక్కడి నుంచి బరిలో దిగనున్నారు.

నాగర్‌కర్నూల్‌ భరత్‌ ప్రసాద్‌‌కు టికెట్ ఖరారు చేశారు. బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాములు ఇటీవల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. ఆయన తనయుడు భరత్ ప్రసాద్.

తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీలలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావుకు మాత్రం తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఇంకా 8 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి ఉంది.

తెలంగాణ నుంచి బీజేపీ తొలి జాబితాలో సీటు దక్కించుకున్న 9 మంది అభ్యర్థులు: 

1. సికింద్రాబాద్- కిషన్ రెడ్డి

2. నిజామాబాద్ -ధర్మపురి అర్వింద్

3. కరీంనగర్ – బండి సంజయ్

4. హైదరాబాద్- డాక్టర్ మాధవీ లత

5. మల్కాజ్‌గిరి -ఈటల రాజేందర్

6. జహీరాబాద్ – బీబీ పాటిల్

7. చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

8. నాగర్ కర్నూలు – భరత్ ప్రసాద్

9. భువనగిరి – బూర నర్సయ్య గౌడ్