Telangana Lok Sabha: దెబ్బ మీద దెబ్బ.. పార్లమెంటులో ప్రాతినిథ్యం కోల్పోయిన బీఆర్ఎస్

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత సమకాలీన రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్‌ ఎన్నికలకు కేసీఆర్‌ కుటుంబం దూరంగా ఉండటం బీఆర్‌ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ. 2014 నుంచి 2023 నవంబర్‌ వరకు దాదాపు పదేళ్లు తెలంగాణ..

Telangana Lok Sabha: దెబ్బ మీద దెబ్బ.. పార్లమెంటులో ప్రాతినిథ్యం కోల్పోయిన బీఆర్ఎస్
Brs

Updated on: Jun 04, 2024 | 7:13 PM

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత సమకాలీన రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్‌ ఎన్నికలకు కేసీఆర్‌ కుటుంబం దూరంగా ఉండటం బీఆర్‌ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ. 2014 నుంచి 2023 నవంబర్‌ వరకు దాదాపు పదేళ్లు తెలంగాణ అధికార పార్టీగా చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ పార్టీని వీడటం బీఆర్‌ఎస్‌ను మరింత దెబ్బకొట్టింది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవలేకపోవడం ఊహించని పరిణామమే. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి.

ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ బరిలో నిలబడలేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలిచారు. అప్పటి యూపీఏ సర్కారులో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006, 2008లో జరిగిన కరీంనగర్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికలో ఆయన విజయం సాధించారు. 2009లో ఆయన మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడంతో కేసీఆర్‌ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి కేసీఆర్‌ కుమార్తె కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. అలాగే కేసీఆర్‌ కుటుంబం నుంచి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు.

వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు చాలా మంది విముఖత చూపారు. టికెట్‌ ప్రకటించిన తర్వాత చాలా మంది పార్టీ ఫిరాయించారు. ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనకు, తమ పదేళ్ల పాలనకు తేడా చూసి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేయాలని కేసీఆర్‌ కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు ఆదరించలేదు. పోటీచేసిన స్థానాల్లో మహబూబాబాద్‌, ఖమ్మంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలోలో నిలిచింది.

ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో పోలైన ఓట్లలో బీఆర్‌ఎస్‌ కేవలం 16.69 శాతం ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. సంఖ్యాపరంగా ఇది పెద్దగానే కనిపిస్తున్నా అవి సీట్ల రూపంలోకి మారలేదు. ఓట్లపరంగా చూస్తే ఇది కేవలం 36 లక్షల 19 వేల 626 మాత్రమే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి