Telangana Lockdown: తెలంగాణాలో రేపటి నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ నిర్ణయంపై భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ విధించబోమని కొద్దికాలం క్రితం చెప్పిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం పై పలువురు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సభ్యుడు, మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై ఒక పోస్ట్ చేశారు. ”తెలంగాణా ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితిలోనూ లాక్‌డౌన్ ఉండదని చెప్పారు. కానీ, ఈ మాట నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కోర్టు నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం ఆందోళన కలిగిస్తోంది” అని ఒవైసీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. లాక్ డౌన్ పట్ల తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పారు.
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాను ఎదుర్కోవడం కోసం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. రేపు (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. లాక్‌డౌన్ విదిస్తున్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఇక వ్యాక్సిన్ కొరతను నివారించేందుకు తెలంగాణ కేభినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందనీ.. ఇప్పటికే గత లాక్‌డౌన్ తోనే ప్రజలు ఇబ్బంది పడ్డారనీ చెప్పారు. అయితే, ఈరోజు అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నిన్న కోర్టులో ప్రభుత్వం పై వచ్చిన వ్యాఖ్యలే కారణం అని అందరూ అనుకుంటున్నారు.
Also Read: Telangana Lockdown: తెలంగాణలో కఠినంగా లాక్ డౌన్.. ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీస్ శాఖ