Telangana: తెలంగాణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశానికే రోల్ మోడల్‌!

Davos: తెలంగాణ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత రెండేళ్లలో దావోస్ వేదికగా సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు. అలాగే..

Telangana: తెలంగాణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశానికే రోల్ మోడల్‌!
Minister Sridhar Babu

Edited By:

Updated on: Jan 20, 2026 | 5:13 PM

Davos: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన “ఇండియా పెవిలియన్” ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. తెలంగాణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులతో పెట్టుబడిదారులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికాబద్ధమైన అడుగులు వేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తును ఎదురుచూడడం కాదు, దానిని నిర్మించడమే ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. నిపుణులు, పరిశ్రమలు, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌లో కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణకు బలమైన ఎకోసిస్టమ్ ఉందని మంత్రి వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, అప్పారెల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ రంగాల్లో కొత్త పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వంటి భవిష్యత్ రంగాలపై తెలంగాణ ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మంత్రి పేర్కొన్నారు. గత రెండేళ్లలో దావోస్ వేదికగా సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు.

ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కొత్త పాలసీలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. “తెలంగాణ బ్రాండ్”ను గ్లోబల్ స్థాయిలో మరింత బలపరిచే దిశగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి