దళిత బంధు పథకంపై దాఖలైన 4 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఎన్నికలు జరిగే హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయమని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య , కాంగ్రెస్ నేత హడ్సన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
గురువారం వీటిని విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ రెండింటితో పాటు దళిత బంధు పథకంపై దాఖలైన మరో రెండు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ఈ మేరకు హుజురాబాద్‌లో దళిత బంధు నిలిపివేతపై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి…పథకం అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్లు చేసిన డిమాండ్లను హైకోర్టు తోసి పుచ్చింది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: