ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హైకోర్టు సంచలన తీర్పు..

|

Dec 26, 2022 | 5:31 PM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హైకోర్టు సంచలన తీర్పు..
TRS MLAs Poaching Case
Follow us on

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. దర్యాప్తును CBIకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. సిట్‌ ఏర్పాటును కూడా రద్దు చేసింది. అంతేకాదు వెంటనే.. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, వాంగ్మూలాలను CBIకి అప్పగించాలని స్పష్టం చేసింది. అంటే దర్యాప్తు సిట్‌ నుంచి CBI చేతుల్లోకి వెళ్లిందన్నమాట..! ఇప్పటికే ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు CBI వస్తోంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

అక్టోబర్‌-26న వెలుగుచూసిన ఫామ్‌హౌస్ డీల్‌.. తెలంగాణ రాజకీయాల్లో ఓ పెను సంచలనం అయింది. సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్లీ అదే తరహా మలుపు. రెండు నెలలుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఈ కేసు చుట్టూనే తిరిగాయి. నవంబర్‌9న సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది బీజేపీ. సిట్టింగ్ జడ్జి లేదా CBIకి కేసును అప్పగించాలంటూ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో హైకోర్టులో మొత్తం 5 పిటిషన్లు పడ్డాయి. ఇందులో ఒకటి బీజేపీ వేయగా.. మరో మూడు ముగ్గురు నిందితులు, మరొకొటి ఓ అడ్వకేట్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాలు కూడా జరిగాయి. ఇందులో BJPతోపాటు అడ్వకేట్ వేసిన పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం.. ముగ్గురు నిందితుల పిటిషన్లను పరిగణలోకి తీసుకుంది. సిట్‌ దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని… కేసుకు సంబంధించిన వీడియో, ఆడియోలతోపాటు ఇతర వివరాలన్నీ ముందుగానే CMకు అందించారని నిందితుల తరపు లాయర్లు వాదించారు.

ఫామ్‌హౌస్‌ కేసులో రామచంద్రభారతిని A-1గా, నందకుమార్‌ను A-2, సింహయాజి-A3గా చేర్చారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారించారు. బెయిల్‌ కూడా వచ్చింది. ఇక ఇదే కేసులో కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను కూడా విచారించి ఆయన్ను A4 గా చేర్చారు..! ఇక BJP నేత BL సంతోష్‌, కేరళకు చెందిన BDJS నేత తుషార్‌, వైద్యుడు జగ్గుస్వామి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. ! ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ…మెమో దాఖలు చేసింది. అయితే ఈ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇక BL సంతోష్‌కు 41 CRPC నోటీసులపైనా చాలా రోజులు వాదోపవాదాలు జరిగాయి…! సిట్‌ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది హైకోర్టు.!

ఇక ఫామ్‌కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వడం మరో సంచలనం . మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ దర్యాప్తు షురూ చేసింది. ఫిర్యాదుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది. మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ ను ప్రశ్నించారు. ఇక A2గా ఉన్న నందకుమార్‌ను చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తోంది ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం రేపు కూడా నందకుమార్‌ను ప్రశ్నించనుంది. అసలు ఈ కేసులో ఈడీకి ఉన్న విచారణ అర్హతను సవాల్ చేస్తూ ఇవాళే…హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు రోహిత్ రెడ్డి.. ఈ లోపే.. CIT ఏర్పాటును రద్దు చేస్తూ… దర్యాప్తును CBIకి అప్పగించింది హైకోర్టు.

సుప్రీం కోర్టుకు తెలంగాణ సర్కార్..

మరోవైపు ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. హైకోర్టు పూర్తిస్థాయిలో తీర్పు కాపీని అందించిన తర్వాతే న్యాయనిపుణులతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది.