మైనర్(Minor) ఇష్టపూర్వకంగానే తన బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా అది అత్యాచారం కిందికే వస్తుందని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు వెల్లడించింది. అవాంచిత గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, అంతేకాకుండా శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉంటుందని తెలిపింది. అత్యాచారం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేసింది. బంధువు చేసిన మోసం కారణంగా గర్భం దాల్చిన ఓ బాలికకు ఆ అవాంఛిత గర్భం తొలగించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గర్భాన్ని తొలగించాలని బాలిక కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆసుపత్రిని ఆశ్రయించగా.. అందుకు వైద్యులు నిరాకరించారు. చట్టప్రకారం అనుమతులు అవసరమని చెప్పడంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
బాలిక ఇష్టంతో కలిసినా, బలవంతంగా కలిసినా అది అత్యాచారమే. దీని మూలంగా మైనర్ గర్భం దాల్చితే మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత సమాజంలో ఇలా ఎదగడం ఎంతో కష్టతరం. ఫలితంగా అత్యాచారం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకోవచ్చు. దీనికి ముందు బాలికతో మాట్లాడాల్సి ఉంది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమే. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తమ అభిప్రాయం చెప్పాలి. బాలికతో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాడాలి. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలు వివరించాలి. ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలి.
– తెలంగాణ హై కోర్టు
Also Read
Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!