రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రుల నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఆసుపత్రిని శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆసుపత్రి పారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి కృషి వల్లే జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైందన్నారు. లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రి ఊరికి దూరంగా ఉండకూడదు అని తన సొంత స్థలాన్ని ఇచ్చి నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్‌కి మెడికల్ కాలేజీ ఎందుకు రాలేదన్న మంత్రి.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ వస్తే.. బీఆర్‌ఎస్ పాలలో గడిచిన ఒక్క ఏడాదిలోనే 8 మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. ఉమాడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ కి కూడా 50 పడకల ఆసుపత్రి మా లక్ష్మారెడ్డి గారు ఇచ్చారని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు ,బీమా, కోయిల్ సాగర్ లో ఈరోజు నీళ్లు వచ్చాయి అంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, BRS ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. మహబూబ్ నగర్ నుంచి బొంబాయి బస్సులు బంద్ అయినాయి. కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా. గమ్యాన్ని ముద్దాడే వరకు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కెసిఆర్ గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే వాడివా. నీకు ఆ పదవి వచ్చిందంటే రాష్ట్రం సాధించినందుకే వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్ద’ని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..