హైదరాబాద్, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి అనారోగ్యంతో గురువారం (డిసెంబర్ 26) రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాప్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బెళగావి నుంచి ఖర్గే, రాహుల్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇక ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. మన్మోహన్ కుటుంబసభ్యుల్ని ప్రధాని మోదీ ఫోన్‌లో పరామర్శించారు.
ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప రోజులపాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్‌సింగ్ మృతి పట్ల సంతాపం తెలపనుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మన్మోహన్ మృతిపట్లు సంతాపం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.