
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. అక్టోబర్ 17న కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో ఛాతిలో పొడిచి చంపిన రియాజ్, ఆదివారం మరో యువకుడు ఆసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసిఫ్‌తో జరిగిన ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడు. అడ్డుపడిన ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.
కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పిస్తున్నట్లు డీజీపీ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉందన్నారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకి , అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి.. ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటాయని డీజీపీ స్పష్టం చేశారు.
GO Rt No. 411 ప్రకారం ఒక కోటిరూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు వచ్చే జీతంలో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు, అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి ఇచ్చి.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ ప్రకటించారు.