
రాష్ట్రంలోని గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. వారి భూములకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నాబార్డ్ సంస్థ నుంచి రూ. 600 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డ్ సంస్థతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మార్చి నెలలోపు నిధులను మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించింది. వీటితో పాటు అనుకున్నట్టు నాబార్డు సంస్థ నుంచి కూడా ప్రభుత్వానికి నిధులు మంజూరు అయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక నిధులు అందింన వెంటనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్న అర్హులైన రైతుల నుంచి ధరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించనుంది.
అయితే ఈ స్కీమ్ కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక్కో రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. అయితే రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం విగియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌ను అమ్మేందుకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ మిగులు గ్రిడ్ ద్వారా ప్రతి రైతు నెలకు సుమారు రూ.3 నుంచి 5వేల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.