Hyderabad: హైదరాబాద్ ఆటోవాలాకు మరో షాకింగ్ న్యూస్..! ఇకపై ఆ ఆటోలకు సిటీలోకి నో ఎంట్రీ!
తెలంగాణలో ఒకప్పుడు ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయం తగ్గుతోందని గొడవ ఉండేది. ఇప్పుడు బస్సుల వల్ల ఆటోల ఆదాయం తగ్గుతోందన్న లొల్లి నడుస్తోంది. తాజాగా హైదరాబాద్ ఆటోవాలాకు కొత్త కష్టం వచ్చి పడింది.
ఇప్పటికే మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకంతో ఇబ్బంది పడుతున్న ఆటోలకు ఇది మరో షాకింగ్ న్యూస్..! ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ అలర్ట్ అయింది. వాయు కాలుష్యం ఎక్కువగా వెదజల్లే వాహనాల క్రమబద్దీకరణకు కొత్త పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు సరికొత్త స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది. అంతేకాకుండా డీజిల్ వాహనాలను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయాలని భావిస్తోంది.
కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుడడంతో హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా హైదరాబాద్‌లో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో 90% బస్సులు డీజిల్ వాహనాలే. అందుకని డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాలని నిర్ణయించింది. ఇక, మూడు వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో తిప్పనున్నారు. ఇక, బస్సుల తర్వాత అత్యధికంగా రోడ్ల మీద నడిచే వాహనాల్లో ఆటోలు కూడా ప్రధానం. అందుకనే డీజిల్‌తో నడిచే ఆటోలను కూడా ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలని రింగ్ రోడ్డు లోపల తిరిగేందకు ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం జరిగిన రవాణా శాఖ ఉత్సవాల్లో ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకొందామని సీఎం పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ వాహనాలు తిరగకూడదని చెప్పారు. డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు వరకే పరిమితం చేయాలని సూచించారు. అలాగే డీజిల్ ఆటోలను సైతం నగర శివారులకు తరలించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎలక్ట్రిక్ బస్సులు వాడాలనుకోవడం సరే, కానీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు స్కీం తో ఆదాయ కోల్పోయిన ఆటోలకు ఇప్పుడు డీజిల్ ఆటోలకు సిటీలో తిరగనివ్వమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది కచ్చితంగా షాకింగ్ న్యూస్ అంటున్నారు.
అయితే దీనిపై ఇప్పుడు ఆటో యూనియన్ ఎలా స్పందిస్తాయో చూడాలి. హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా ఆటోలన్ని ఎల్పీజీ తో నడుస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో నడుస్తున్న డీజిల్ ఆటోల సంఖ్య ఎంత అనేది తేలితే ఈ నిర్ణయం వల్ల ఆటో యూనియన్ నుంచి వ్యతిరేకత ఎంత మేర వస్తుందనేది అంచనా వేయొచ్చు..! కాలుష్యాన్ని తగ్గించాలనుకోవడం మంచి ఆలోచన. డీజిల్ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు లోపల తిరగవద్దనుకునే ఆలోచన మంచిదే..! కానీ దానివల్ల ఆటో వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు మాత్రం నగరంలో డీజిల్ ఆటోలు తిరగకూడదని నిర్ణయం వల్ల ఇబ్బంది పడటం తప్పని పరిస్థితిలో కనిపిస్తుంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..