Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే.. సర్కార్ తెచ్చిన మరో వెసులుబాటు..

Telangana Farmers Get Direct Market Access : తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు పండించే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దళారుల దోపిడీని నిరోధించేందుకు రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులు తామూ పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో విక్రయించి మంచి ధర పొందవచ్చు. వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయాలు అందుబాటులోకి వస్తాయి.

Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే.. సర్కార్ తెచ్చిన మరో వెసులుబాటు..
Telangana Farmers Get Direct Market Access

Updated on: Dec 27, 2025 | 8:30 AM

రైతులు కష్టపడి పడి పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో అమ్ముకునే వెసులుబాటు లేక మధ్యవర్తులు అందించే అరకొర రేట్లకు తాము పండించిన కూరగాయలను అమ్ముతుంటారు. దీని వల్ల వారు ఆశించిన స్థాయిలో లాభాలు రావు. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలను నిర్ణయించుకుంది. రైతులకు దళారుల దోపిడి నుంచి విముక్తి కల్పిస్తూ.. రైతులే తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునే విధంగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో లోకల్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం నిర్ణయంతో అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభం చేకూరనుంది, రైతులకు సరైన గిట్టుబాటు ధరతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు లభిస్తాయి.

ప్రతి 50 కి.మీ ఒక లోకల్‌ మార్కెట్

అయితే దీనిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక మండల కేంద్రంలో లోకల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో కేవలం 11.91 లక్షల ఎకరాల్లో మాత్రమే ఉద్యాన పంటల సాగు కొనసాగుతుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 42.56 లక్షల టన్నుల ఉత్పత్తుల దిగుబడి వస్తోంది. అయితే వచ్చిన ఈ దిగుబడిని కూడా సరైన సమయంలో అమ్ముకునే సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పట్టణకేంద్రాలకే పరిమితమైన రైతుబజార్లు

అయితే రాష్ట్రంలో ఇప్పటికే 30కిపైగా రైతుబజార్లు ఉన్న అవి కేంద్ర ప్రధాన నగరాలు, పట్టణ కేంద్రాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించే రైతులు అంతదూరం తమ ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు అయ్యే రవాణ ఖర్చులను భరించలేక.. లోకల్‌గా ఉండే దళారులకు అరకొర ధరకు తాము పండించిన కూరగాయాలు అమ్మేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతుల సమస్యకు పరిష్కారమార్గాలను ఆలోచించాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ నిపుణులను ప్రభుత్వం కోరగా..క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన నిపుణు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

స్థల సేకరణకు ఆదేశాలు

మండలకేంద్రాల్లో లోకల్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా.. వారే నేరుగా తాము పండించిన కూరగాయాలను విక్రయించి ఆశించిన మేర లాభాలు పొందవచ్చు. దీని వల్ల వినియోగదారులకు సైతం తాజాగా కూరగాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే ఈ మార్కెట్‌లలో శీతలీకరణ యంత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్‌లను కూడా ఏర్పాటు చేస్తే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో లోకల్‌ మార్కెట్‌ల ఏర్పాటు కోసం తక్షణమే స్థల సేకరణ చర్యలు మొదలు పెట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.