
‘విజన్ 2047’ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హైస్పీడ్ కారిడార్లు, 6 వరుసల రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలు అభివృద్ధి చేసేందుకు సిద్దమైంది. ఈ నేపధ్యంలోనే పలు ప్రణాళికలు సిద్దం చేసింది. సుమారు 1800 కిలోమీటర్ల మేర కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలను నిర్మించాలని నిర్ణయించింది. గ్రామీణ రోడ్లను 46 వేల కిలోమీటర్ల నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, నాగ్‌పూర్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలకు ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ వేలుగా విస్తరించనుంది. వీటన్నింటికి రూ. 29,057 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
అలాగే ఈ రోడ్లు, రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడ్’ అనే సరికొత్త విధానాన్ని అనుసరించనుంది. ఇక ఈ రహదారుల అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్దం చేయడం, నిధులను సమీకరించడం లాంటివి చేసేందుకు ప్రభుత్వం ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ పత్రాన్ని తయారు చేస్తోంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు అప్పగించారు. ఒక్క రోడ్లను వేయడమే కాదు.. ప్రమాదాలు తగ్గించేందుకు ‘స్మార్ట్ మొబిలిటీ’ పద్దతులను కూడా ప్రవేశపెట్టనుంది. రహదారుల వెంట అత్యాధునిక లైటింగ్, సీసీ కెమెరాలు, అత్యవసర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్-బెంగళూరు మధ్య ఉన్న మార్గాన్ని రూ. 5,221 కోట్లతో ఎక్స్ ప్రెస్‌వేగా మార్చేందుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే హైదరాబాద్ – విజయవాడ మార్గం మధ్య ప్రస్తుతం 4 వరుసల రహదారి ఉండగా.. దాన్ని 6 వరుసలగా విస్తరించనుంది. దీనిని రూ. 9,090 కోట్లతో నిర్మించనున్నారు. హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో 150 కిలోమీటర్ల దూరాన్ని 4 వరుసలగా.. నాగ్‌పూర్ – హైదరాబాద్ మధ్య ఉన్న దాదాపు 397 కిలోమీటర్ల రహదారిని 6 వరుసలగా తీర్చిదిద్దనున్నారు. అటు కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 234 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అభివృద్ధి చేయనున్నారు. ఇలా రహదారులు నిర్మాణం జరిగాక.. కచ్చితంగా హైదరాబాద్ నుంచి పలు మెట్రోపాలిటన్ సిటీలకు ప్రయాణం సమయం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త రహదారుల వెంబడి ఎత్తైన మొక్కలను నాటడం, వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అటు గ్రామీణ రోడ్లను కూడా రహదారులతో కలిపితే.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..