Telangana Government: తెలంగాణ ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్.. వారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు.. 5 లక్షల మందికి లబ్ది..

తెలంగాణ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త అందించింది. వీళ్లు ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలకు ఇక చెక్ పడనుంది. వీరికి రెగ్యూలర్ ఉద్యోగుల తరహాలోనే ప్రభుత్వం నుంచే నేరుగా జీతాలు అకౌంట్లో జమ కానున్నాయి. ఇప్పటివరకు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా చెల్లింపులు జరిగేవి.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్.. వారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు.. 5 లక్షల మందికి లబ్ది..
Telangana Government

Updated on: Jan 21, 2026 | 11:30 AM

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.227 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించడంతో పాటు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో క్రాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇక నుంచి నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు జమ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న పద్దతిలోనే వీరికి వేతనం అందించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు కానుంది.

త్వరగా జీతాలు

ఇప్పటివరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనం అందించారు. వీరికి ఇచ్చే జీతాలను ఏజెన్సీలకు ప్రభుత్వం అందించేది. ఈ ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో నెలవారీ వేతనం జమ చేసేవి. కానీ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఇందులో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోత విధిస్తున్నాయి. కొంత మొత్తం మాత్రమే ఉద్యోగులకు చెల్లించి మరికొంత తమ వద్దే ఉంచుకుంటున్నాయి. ఇక కొన్ని ఏజెన్సీలు నకిలీ ఉద్యోగులను సృష్టించి అక్రమంగా ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నాయి. అలాగే ప్రభుత్వం జమ చేసే పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులను కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా మోసానికి పాల్పడుతున్నాయి. ఇటీవల ఇలాంటి కుంభకోణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అక్రమాలకు చెక్ పెట్టి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లబ్ది చేకూర్చేందుకు థర్డ్ పార్టీ ప్రమేయంగా లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది

రాష్ట్రంలో 5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. గురుకురాలు, యూనివర్సిటీలు, హెల్త్ డిపార్ట్‌మెంట్, మున్సిపాలిటీల్లో లక్షల మంది ఈ విధానంలో పని చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు జీతాలు సరిగ్గా అందటం లేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో వారికి సకాలంలో జీతాలు రావడంతో పాటు పీఎఫ్ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు అందనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్‌ఎంఎస్ విధానం లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా వేతనం జమ చేస్తున్నారు. ఇక నుంచి మిగతా ఉద్యోగులకు కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో ప్రత్యేక ఆప్షన్ చేర్చనున్నారు. దీని వల్ల ఎన్నో సంవత్సరాలుగా జీతాలు పొందటంతో ఇబ్బంది పడుతున్నఉద్యోగులందరికీ లాభం జరగనుంది.