ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే రూ.2 వేల ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారితో ప్రైవేటు పాఠశాలలు మూతపడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడి కొలువులు కోల్పోయిన వారికి నెలకు రూ.2 వేల చొప్పున నగదు సహాయం మంగళవారం నుంచి అందనుంది. నగదుతో పాటు, 25 కిలోల సన్న బియ్యం పొందేందుకు అర్హులైన బోధన, బోధనేతర సిబ్బందిని గుర్తించారు. ఈ నెల 24 వ తేదీవరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. 33 జిల్లాల పరిధిలో మొత్తం 1, 24,704 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.
వీరిలో 1,12, 048 మంది టీచర్లు ఉండగా, 12,636 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఆదివారం వరకు 1,18,004 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల నుంచి మరికొంత మందిని ఎంపికచేశారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,24,704కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి నేటి నుంచి రూ. 2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. బుధవారం నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉంచింది. ఈనెల 21 – 25 వరకు వారికి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందజేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం గత వారం ప్రకటించినట్లుగానే.. ఇవాళ కరోనా సాయం పేరుతో ప్రైవేట్ టీచర్లకు డబ్బు ఇస్తోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉంటే… అందరికీ ఆ ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు అమలు చేస్తున్నారు. ఏడాదిగా ప్రైవేట్ స్కూళ్లు మూతపడటంతో టీచర్లు రోడ్డున పడ్డారు. స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నా… తమకు మాత్రం శాలరీలు ఇవ్వట్లేదని టీచర్లు తీవ్ర ఆవేదన చెందడంతో… వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
గత వారం ప్రభుత్వం ఈ ప్రకటన చెయ్యగానే… 2,06,345 మంది తమకు ఆర్థిక సాయం కావాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా ప్రభుత్వం సోమవారం సాయంత్రం వరకూ దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని జల్లెడ పట్టగా… మొత్తం 1 లక్షా 24వేల మందికి సాయం చెయ్యవచ్చని వారిని లబ్దిదారులుగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also….సెకండ్ థాట్ ! రెండో విడత ఎకనామిక్ ప్యాకేజీపై ప్రభుత్వ కసరత్తు, రేపో, మాపో ప్రకటించే సూచన..