
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.6 వేల చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో అన్ని ఎకరాలకు రూ.6 వేల చొప్పున జమ చేయనుంది. ఇప్పటికే తొలి విడత నగదు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవ్వగా.. ఈ క్రమంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.
కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ బుక్‌లు పొందిన రైతులకు కూడా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి నిధులు జమ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ బుక్ పొందిన 85 వేల మంది రైతులు ఉండగా.. వీరిలో 62 వేల మంది రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీళ్లు రైతు భరోసాకు అర్హత కలిగి ఉన్నారా.. లేదా అనేది తనిఖీ చేపడుతోంది. అనంతరం నిర్ధారణ చేపట్టి లబ్దిదారుల జాబితాలో చేర్చనుంది. 10 రోజుల్లో అర్హుల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అర్హత పొందినవారికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్యలో రైతు భరోసా విడుదల చేయనున్నారు.
యాసంగి సీజన్‌లో మొత్తం రూ.9 వేల కోట్లను రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వానాకాలం సీజన్‌లో లబ్ది పొందిన రైతులందరికీ ఈ సారి కూడా అందిస్తోంది. ఎవరికి ఎలాంటి కొతలు విధించలేదు. ఇక కొత్తగా పాస్ బుక్‌లు పొందినవారికి కూడా అందించాలని నిర్ణయించింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 69.39 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లను విడుదల చేసింది. అప్పట్లో 9 రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లో వేసింది. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు మొదలుపెట్టి.. 9 రోజుల్లో అందరికీ జమ చేసింది. అయితే ఈ సారి నిధుల విడుదలకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ పాటిస్తోంది. ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా.. తొలి ఎకరానికి తొలి విడతలో జమ చేసింది. దీంతో ఒకేసారి అందరికీ లబ్ది చేకూరినట్లయింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.