Mahbubnagar: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్‌ఎస్‌ను వీడనున్నారా? ఆయన తన సొంత గూడు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు, అనుచరులు. పార్టీ మారే అంశంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆయన వెన్నంటే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనను కాంగ్రెస్ గూటికీ చేరాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అంతర్గతంగా జరుగుతున్న సమావేశాల్లో కాంగ్రెస్‌లో చేరాల్సిన ఆవశ్యకత గురించి తరచూ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీతో బలమైన అనుబంధమున్న, బలమైన నాయకుడు తిరిగి పార్టీలో చేరడం వల్ల విస్తృతమైన ప్రయోజనం కలుగుతుందన్న యోచనలో ఉన్న టీపీసీసీ కూడా జూపల్లి రాక కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. పార్టీ మారడంపై ప్రసార మాధ్యమాల్లో అనేక విశ్లేషణలు, కథనాలు వస్తున్నప్పటికీ జూపల్లి మౌనాన్ని వీడకపోడం గమనార్హం.
టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుల మధ్య నిరంతరం ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2018లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనూహ్యంగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి కారు ఎక్కడం జూపల్లి వర్గీయులకు ఏమాత్రం రుచించ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి వర్గీయులు ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. దీంతో బీరం, జూపల్లి వర్గీయుల మధ్య వైరం మరింత పెరిగింది. నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తున్న బీరం శైలికి మండిపడుతున్న జూపల్లి అనుచరులు టీఆర్‌ఎస్‌ను వీడాలని బలమైన డిమాండ్‌ను తమ నాయకుడి ముందుంచారని సమాచారం.
ఈ క్రమంలో జూపల్లి ముందు రెండు ఆప్షన్లున్నాయి. టీఆర్‌ఎస్‌ను వీడితే బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంటుంది. బీజేపీ రాష్ట్ర శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో జూపల్లికి విబేధాలుండడం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బీజేపీలో చేరడం శ్రేయస్కరం కాదని అనుచరులతో పాటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన జూపల్లికి ఆ పార్టీ సీనియర్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడం కారణంగా ఆయన్ను ఎలాగైనా సొంత గూటికీ రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం, కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రధానమైన ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వారం రోజులుగా ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మౌనం వీడడం లేదు. మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
Also read:
Disinvestment: ప్రస్తుతానికి ఆ బ్యాంకుల ప్రయివేటీకరణ లేనట్టే.. కీలక సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..