బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం.. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో 'తెంగాణం' మరోసారి భగభగా మండుతోంది.

బద్దలైన అస్తిత్వ అగ్నిపర్వతం..  రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైనమైట్లు!
Telangana Politics

Updated on: Jun 02, 2026 | 9:49 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని అగ్గి రాజుకుంది. పదేళ్ల ఆవిర్భావ వేడుకల వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ అస్తిత్వ రాజకీయాల తేనెతుట్టె ఒక్కసారిగా కదిలింది. అస్తిత్వ అగ్నిపర్వతం భళ్లున బద్దలై, రెండు రాష్ట్రాల నేతల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలేలా చేస్తోంది. తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ఇక్కడికి వచ్చి రాజకీయం చేసే హక్కు ఎవరికి ఉంది? అనే యక్ష ప్రశ్నలతో ‘తెంగాణం’ మరోసారి భగభగా మండుతోంది.

హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి రాకపోవడంతో రద్దయింది. దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “హైదరాబాద్‌లో అడుగు పెట్టడానికి నీకేం పని అంటూ నన్ను బెదిరిస్తున్నారు. మేమేమైనా బాంచన్ అనేవాళ్లమా? నన్ను బెదిరించేవాళ్ల అయ్యా జాగీరా తెలంగాణ?” అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికి పాస్‌పోర్టులు తీసుకోవాలా అని ప్రశ్నించిన ఆయన, ఇది హైదరాబాదా లేక పాకిస్తానా, పాలస్తీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బరాబర్ తెలంగాణలో పోటీ చేసి తీరుతామని, జనసేన ఇక్కడ ఉండి తీరుతుందని రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా స్పందించారు. “యస్.. బరాబర్ తెలంగాణ మా అయ్యా జాగీరే! ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఏపీలోనే దిక్కు లేని పవన్ ఇక్కడికొచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు పవన్ సొంత సొమ్మా అని ప్రశ్నించిన పొన్నం.. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారన్న పవన్ మాటల్లో తెలంగాణపై ద్వేషం కనిపిస్తోందని మండిపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్‌పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ అస్తిత్వంపై పవన్‌ను ప్రశ్నించిన వారికి ఆయన గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సమాధానమిచ్చారు. గద్దర్ ఒంట్లో దిగిన బుల్లెట్ల గురించి తనతో చెప్పుకున్నారని, ఆయన కోరగానే రెండు రోజుల్లో కారు కొనిచ్చానని పవన్ తెలిపారు. అలాగే ఏపీ-తెలంగాణ సరిహద్దు హైవేపై బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని పెట్టాలని ప్రతిపాదిస్తూ, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు కూడా ప్రాంతీయ తత్వం అంటగట్టే ప్రమాదం ఉందని చురకలు వేశారు. ఇక తనపై వచ్చిన చెరువు కబ్జా ఆరోపణలపై స్పందిస్తూ, నిజంగా కబ్జా చేశానని నిరూపిస్తే ఆ స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాసిస్తానని సవాల్ విసిరారు.

ఈ పొలిటికల్ వార్‌పై ప్రతిపక్షాలు తమదైన శైలిలో స్పందించాయి. ఇది కాంగ్రెస్, జనసేన మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అని బీఆర్ఎస్ సెటైర్లు వేయగా, కేసీఆర్, అమిత్ షాలను మెప్పించడానికే పవన్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ రిటార్ట్ ఇచ్చింది. అయితే, పవన్ వెనుక బీజేపీ ఉంటే ఇంత గొడవ జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని పవన్ ఎదురు ప్రశ్నించారు. అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పవన్‌కు మద్దతుగా నిలిచారు. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని, పవన్ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ నుంచి వైసీపీ నేత పేర్ని నాని, బొత్స సత్యనారాయణ కూడా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి, ఆవిర్భావ దినోత్సవం వేళ రాజుకున్న ఈ అస్తిత్వ నినాదం రెండు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us