Munugode Bypoll: భూత వైద్యంలో విద్యను ప్రవేశపెట్టిందే బీజేపీ.. బండి సంజయ్‌కు మంత్రి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..

|

Oct 09, 2022 | 8:16 PM

తెలంగాణ రాజకీయంలో హాట్‌ హాట్‌ డైలాగ్స్‌ పేలుతున్నాయి. మంత్రం.. తంత్రం చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ తాంత్రిక..

Munugode Bypoll: భూత వైద్యంలో విద్యను ప్రవేశపెట్టిందే బీజేపీ.. బండి సంజయ్‌కు మంత్రి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్..
Minister Harish Rao
Follow us on

తెలంగాణ రాజకీయంలో హాట్‌ హాట్‌ డైలాగ్స్‌ పేలుతున్నాయి. మంత్రం.. తంత్రం చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ తాంత్రిక పూజలు చేశారంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్లపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బండితో పాటు కమలం అగ్రనేతలూ చేసిన వ్యాఖ్యలకూ కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన.. తెలంగాణకు ఏం చేస్తామో అనేది చెప్ప చేతకాక ఇలా క్షుద్రపూజల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారు చెప్పుకోవడానికి చేసిందేమీ లేకనే మంత్రాలు, తంత్రాలు అంటూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు తీసుకొచ్చిందే బీజేపీ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రూ. 50 వేల ఫీజుతో భూత వైద్య కోర్సును ప్రారంభించింది యూపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. బండి సంజయ్ ఈ కోర్సులో చేరితే బాగుంటుందేమో చురకలంటించారు ఆర్ధికమంత్రి. బీజేపీ నేతలకు దమ్ముంటే మునుగొడులో అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు మంత్రి. అలాగే, బీజేపీకి దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ దగ్గర తాంత్రిక విద్యలు లేవని, కేవలం లోక్‌తాంత్రిక్ మాత్రమే ఉందని బండికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ పథకాలు బాగున్నాయి కాబట్టే.. కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం దేశంలో పేర్లు మార్చి అమలు చేస్తోందని, ఇది నిజం కాదని బీజేపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. తాము తాంత్రికం అయితే తమ పథకాలను కేంద్రం ఎందుకు కాపీ కొట్టిందని ప్రశ్నించారు మంత్రి. దేశంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన బీజేపీకి, నియామకాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 8 ఏళ్ళ పాలనలో ఎవరెన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు.

ఇవి కూడా చదవండి

ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తప్పుడు ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజల మనసును గెలువలేరన్నారు. నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రజల మనసును గెలవాలంటే బుల్లెట్ ట్రైన్‌ను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందేబారత్ రైళ్లు బర్రెలు అడ్డం వస్తే తుక్కుతుక్కు అయితుందని ఎద్దేవా చేశారు.

బీజేపీ అధికార దర్వినియోగం..

మునుగోడులో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో బీజేపీ తెచ్చిపెట్టిన ఉపఎన్నికల్లో దొడ్డిదారిన గెలవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తూర్పారబట్టారు. డబ్బులు పెట్టి నాయకులను కొంటున్నారని ఆరోపించారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం నాయకులకు ఇవ్వడానికి 200 బ్రిజా కార్లు, 2000 బైక్ లు బుక్ చేశారన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు. వివరాలు సేకరించడానికి ప్రత్యేక స్వాక్డ్స్ పెట్టామని, ఎన్నికల కమిషన్, పోలీసులకు వివరాలు ఇస్తామన్నారు మంత్రి హరీష్.

ధరల పెంపు తప్ప చేసిందేమీ లేదు..

‘ఇప్పుడు మోటార్లు ఇస్తారు.. తరువాత బావుల దగ్గర మీటర్లు కూడా పెడతారు’ అని బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి. ఈ విషయంపై మునుగోడు ప్రజలు ఆలోచించాలన్నారు. మునుగోడు ప్రజల ఆత్మాగౌరవానికి ఇది పరీక్ష అని, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కానీ, బీజేపీ చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని విమర్శించారు. డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెంచిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి దేశాన్ని ఆగం చేశారని విమర్శించారు. దేశ సైనికులను కూడా వదలకుండా అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చి వారి ఉసురు పోసుకుంటోందని నిప్పులు చెరిగారు మంత్రి హరీష్.

విమానాలు కోనిచ్చినా విజయం టీఆర్ఎస్‌దే..

రాష్ట్ర ప్రజలకోసం కోసం అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చామన్నారు మంత్రి హరీష్ రావు. అయితే, మునుగోడులో చేసిందదేంటో బీజేపీ చెప్పుకోవడానికి ఉందా? అని ప్రశ్నించారాయన. కార్లు, బైకులు కాదు విమానాలు కొనిచ్చినా మునుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారని అన్నారు. ఇవాళ గెలిచేది రాజగోపాల్ ధనమా? లేక ప్రజాస్వామ్యమా? అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం, రూ. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల కోసం మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చారని ఆరోపించారు. బీజేపీ చెప్పేవి నీతులు.. తవ్వేవి మాత్రం గోతులు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అతి ఎక్కువ రైతుబంధు వచ్చిన ప్రాంతం మునుగోడు అని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టాలని, టీఆర్ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..