Telangana Crops: చేతికొచ్చిన పంటలు వరదపాలు కావడంతో లబోదిబోమంటోన్న తెలంగాణ రైతులు

|

Sep 30, 2021 | 9:44 AM

గులాబ్ తుఫాన్ రైతుల గుండెల్లో గునపాలు దించింది. గులాబ్ తుఫాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటలు వరదపాలు

Telangana Crops: చేతికొచ్చిన పంటలు వరదపాలు కావడంతో లబోదిబోమంటోన్న తెలంగాణ రైతులు
Crop Loss
Follow us on

Telangana Farmers: గులాబ్ తుఫాన్ రైతుల గుండెల్లో గునపాలు దించింది. గులాబ్ తుఫాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటలు వరదపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున పత్తి, సోయా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి, ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో పంటలు నీటి మునిగాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దఎత్తున వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు వరదపాలు కావడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. నీట మునిగిన పంటలను చూసి భోరున విలపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ రైతుల గుండెల్లో గులాబ్ తుఫాన్ కల్లోలం రేపింది. వేలాది ఎకరాల్లో వరి కుళ్లిపోయింది. మానేరు డ్యామ్ ఆయుకట్టు మొత్తం నీట మునగడంతో అపార నష్టం జరిగింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి.కామారెడ్డి జిల్లాలో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. 1500 వందల ఎకరాల్లో సోయాబీన్, 700 ఎకరాల్లో మినుప, 800 ఎకరాల్లో పెసర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 6వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.

నిజామాబాద్‌లో ఇంకా వరద బీభత్సం కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పెసరు, అల్లం, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.

Read also: Godavari: గోదావరికి భారీగా వరద.. జయక్‌వాడీ ప్రాజెక్ట్‌ నుంచి విష్ణుపురి వరకు నిండుకుండల్లా ప్రాజెక్టులు