Telangana Farmer: కొంతమంది అనుకోని ఇబ్బందులు ఏర్పడినా. ఆపద వచ్చినా తాము ఏమీ చేయలేమని తమ జీవితం ఇంతే అంటూ భావిస్తూ నిరాశగా జీవిస్తారు. మరికొందరు తమకు వచ్చిన ఇబ్బందులను, కష్టనష్టాలను ఎదుర్కోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ.. సరికొత్త దిశగా అడుగులువేస్తారు. తమని తాము ఆవిష్కరించుకుంటారు. అలాంటి ఓ యువరైతు తాను చేసే వ్యవసాయంలో కూలీల ఖర్చు తగ్గించుకోవాలనుకున్నాడు. మెదడుకు పదును పెట్టాడు. యూట్యూబ్ లోని ఓ వీడియో చూసి.. సరికొత్త కలుపు తీసే పరికరాన్ని సృష్టించాడు. ఇప్పుడు కూలీల ఖర్చును తగ్గించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లోని పెంబి మండలానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే పొలంలో కలుపు తీసేందుకు కూలీల కొరత, అధిక ఖర్చును తగ్గించుకోవాలని భావించాడు. దీంతో శ్రీనివాస్ యూట్యూబ్‌లో చూసి కలుపు తీసే యంత్రాల తయారీని చూశాడు. వెంటనే తన ఆలోచన అమలులో పెట్టి.. కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు.
ఈ కలుపు నివారణ యంత్రం తయారు చేయడం చాలా ఈజీ అని ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చని తెలిపాడు. అంతేకాదు.. రెండు ఇంచుల వెడల్పు , మూడు అడుగుల పొడవు ఉన్న పీవీసీ పైపు తో పాటు .. ఆఫ్ ఇంచ్ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. వీటికి కేవలం రూ. 1000 నుంచి రూ. 1200లు ఖర్చు అవుతుంది.
ముందుగా ఆఫ్ ఇంచ్ ఇనుప పైపుకు గొలుసులు వెల్డింగ్ చేయించి దానిని పీవీసీ పైపునకు తీగతో కట్టాలి. అంతే కలుపు నివారణ పరికరం రెడీ. ఒక తాడు సాయంతో దానిని ముందుకు నడిపించుకుంటూ వెళ్తే.. చిన్న చిన్న కలుపు మొక్కలు గొలుసులకు పట్టుకుని బయటకు వస్తాయని శ్రీనివాస్ చెప్పాడు. తాను ఈ పరికరాన్ని గత ఏడాది నుంచి వాడుతున్నానని… అప్పటి నుంచి కూలీల ఖర్చు లేకపోవడంతో వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గినట్లు తెలిపాడు.
Also Read: కృష్ణాష్టమి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్, పూజా హెడ్గే, కాజల్, రకుల్