ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీజేపీ ఆఫీసుకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బుధవారంనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. తాజాగా బీజేపీ ఆఫీసుకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తన మనవరాలు వివాహానికి రావాల్సిందిగా కిషన్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కిషన్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి.. ఆ తరువాత రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ వరుస భేటీల వెనుక రాజకీయం ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎప్పటి నుంచో మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీలు మరింత ఉత్కంఠ రేపాయి.
అయితే, ఈ ప్రచారంపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. తన మనవరాలి పెళ్లి ఉందని, పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేసినట్లు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీరు టీడీపీలోకి వెళ్తున్నారా అని మీడియా ప్రశ్నించడంతో మల్లారెడ్డి మరోసారి టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టాడని.. ఆయన దయవల్ల తాను ఎంపీ అయ్యానని, బీజేపీ- టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్‌కు వెళ్లా” అని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని అందుకే నా మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానని రాజకీయ అంశాలు మాట్లాడలేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. నా మిత్రుడు కిషన్‌రెడ్డి రెండోసారి కేంద్రమంత్రి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని మల్లారెడ్డి అన్నారు.