తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాంగ్రెస్‌తో దోస్తి కుదరకపోవడంతో..ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లా పాలేరుతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, భర్త అనిల్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు షర్మిల. విలీనంపై తేల్చేసిన వైఎస్ షర్మిల.
తెలంగాణలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగనుండగా.. ఇప్పుడు కొత్తగా జనసేన, బీఎస్పీ, టీజేఎస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు కూడా బరిలోకి దిగుతుండటంతో..పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ..కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు రాగా.. ఇప్పుడు వాటికి షర్మిల చెక్ పెట్టేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అయితే.. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో కూడా షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరుతో పాటు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు షర్మిల వెల్లడించారు. ఆ మరో స్థానం మిర్యాలగూడ అని శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే.. తానే కాదు.. తన తల్లి విజయలక్ష్మి, భర్త బ్రదర్ అనిల్ కూడా పోటీ చేసే అవకాశమున్నట్టు లీకులిచ్చారు. వాళ్లిద్దరూ కూడా పోటీ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు షర్మిల తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్‌లో కలిస్తే.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలవని భావించినట్టు షర్మిల చెప్పుకొచ్చారు.
షర్మిల మాట్లాడుతూ.. “3800 కిలోమీటర్ల మేర అలసిపోని పాదయాత్రతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాం. తెలంగాణ ప్రజల ప్రతి సమస్య , ఆందోళన కోసం పోరాడడంలో మేము మొదటి నుంచి నిజాయితీగా ఉన్నాం. నిరుద్యోగంపై మా పోరాటమే కేసీఆర్ కనీసం కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్‌లను విడుదల చేయడానికి కారణం” అని ఆమె తెలిపారు.
YSRTP, కాంగ్రెస్ విలీనం సాధ్యమవుతుందనే ఊహాగానాలపై షర్మిల ఇలా అన్నారు, “కాంగ్రెస్‌తో విలీనం వైపు అడుగులు వేయాలనే నా గొప్ప ఉద్దేశ్యంతో వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవడమే. నిరంకుశ పాలన మరో పదానికి అర్హత లేదు”
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని, మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని YTP ప్రకటించింది. YTP తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో పోటీ కోసం రైతు,నాగలి గుర్తును YTP కోరింది. దానిపై త్వరలోనే స్పష్టం వస్తుందని YTP తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం