Vennela Vs Lasya Nandita: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం… తెలంగాణ దంగల్‌లో కీలక సెగ్మెంట్ల జాబితాలో చేరిపోయింది. కారణం.. ఇక్కడ పోటీ పడుతున్న ఆ ఇద్దరు మహిళలే. జెండాలు, ఎజెండాలు వేరైనా వీళ్లిద్దరికీ ఉండే బలమైన పోలిక.. ఫాదర్ సెంటిమెంట్. నాన్న కటౌట్‌లే కమర్షియల్ ఎలిమెంట్లుగా ఎలక్టోరల్ ఫైట్‌లో దిగేశారు.. వెన్నెల అండ్ లాస్య. ఒకరిని మించి మరొకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి.. ఇద్దరు కూతుర్లలో కంటోన్‌మెంట్ కిరీటం దక్కేదెవరికి? అనేది ఆసక్తికరంగా మారింది..
వెన్నెల డాటరాఫ్ గద్దర్.. లాస్య నందిత డాటరాఫ్ సాయన్న.. ఇద్దరి కేరాఫ్ ఒక్కటే… కంటోన్మెంట్ నియోజకవర్గం.. ఇద్దరు నాయికల తండ్రులు ఇటీవలే మరణించడం.. ఇద్దరు కూతుర్లూ పొలిటికల్ అరంగేట్రం చేయడం.. ఓట్ల జాతరలో ఒకేసారి దిగెయ్యడం.. ఒకరినొకరు ఢీకొడుతూ, ఒకరిని మించి మరొకరు గెలుపుపై ధీమాతో ఉండడం.. ఇవీ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని హాట్ సెగ్మెంట్‌గా మార్చేశాయి.
జ్ఞాని సాయన్న.. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు ఆయన కూతురు లాస్య నందిత. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. స్థానికంగా సమర్థవంతమైన నాయకులు ఎంతమంది పోటీకొచ్చినా.. కేసీఆర్ మాత్రం సాయన్నకున్న విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని ఆయన కూతురు లాస్య నందిత వైపే మొగ్గు చూపారు. తన తండ్రి చేసిన మంచి పనులే తనకు శ్రీరామరక్ష అంటూ లాస్య నందిత పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల. ఓటుకే దూరంగా ఉండాలన్న విప్లవ నేపథ్యం ఉన్న నాయుకుడు గద్దర్. కానీ.. జీవితం చరమాంకంలో మనసు మార్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించారు. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నారు. గాంధీ ఫ్యామిలీ కూడా గద్దర్ కుటుంబానికి బాసటగా నిలిచింది. అందుకే.. టిక్కెట్టిస్తే పోటీ చేస్తా అని గద్దర్ కూతురు చెప్పీచెప్పగానే.. కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఇక్కడే పుట్టి పెరిగా.. అంటూ లోకల్ సెంటిమెంట్‌ను కూడా కలుపుకు వెళ్తున్న వెన్మెలకు తన తల్లి, గద్దర్ భార్య విమల కూడా బాసటగా నిలబడ్డారు. తన తండ్రి పాటలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని, ఆయన ఆశయాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు వెన్నెల.
ఒకరు ప్రజా నాయకులు.. మరొకరు ప్రజా గాయకుడు.. వారిద్దరి కూతుర్లు ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నువ్వా నేనా రీతిలో పోటీ పడుతున్నారు. గతంలో రాజకీయ నేపథ్యం లేదు.. నేరుగా రాజకీయ అనుభవం లేదు. నాన్నకున్న పేరుప్రతిష్టలే పెట్టుబడి. మరి.. ఏ తండ్రి సెంటిమెంట్ ఇక్కడ ఎక్కువగా పండుతుంది, ఏ కూతురికి కంటోన్మెంట్ ఒటరు పట్టం కడతారనేది ఫలితం వరకు వేచి చూడాల్సిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..