
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్.. కమ్యూనిస్టుల పొత్తు.. సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది.. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీచేద్దామని భావించిన సీపీఎం.. చివరకు కటీఫ్ చేసుకొని.. 17 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన తమ్మినేని వీరభద్రం.. 3 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. సీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరులో పోటీచేయబోతున్నారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే, తమ్మినేని అభ్యర్థులను ప్రకటించే ముందు.. ఆఖరి నిమిషంలో ఫోన్ చేసిన కాంగ్రెస్ పిలుపుపై తమ్మినేని వీరభద్రం తనదైన శైలిలో స్పందించారు. అభ్యర్థులను ప్రకటించవద్దు, కలిసి పనిచేద్దామంటూ కోరగా.. కొన్ని తోక పార్టీల మాదిరి వ్యవహరించమని స్పష్టంచేశారు. తమ బలాన్ని పక్కనపెట్టి ఇతరులకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంచేశారు. అందరికీ మద్దతు ఇవ్వడానికి తమది సన్నాసి పార్టీ కాదని.. కాంగ్రెస్ కు తాము గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదని తమ్మినేని పేర్కొన్నారు. తమకు ఇస్తా అన్న సీట్లు ఇవ్వలేదు, అందుకే అభ్యర్థులను ప్రకటించామని స్పష్టంచేశారు. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో తాము మద్దతిస్తామని.. బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామంటూ పేర్కొన్నారు. చాలా రోజులు ఎదురుచూశాం, కాంగ్రెస్‌తో ఇక పొత్తు లేదంటూ సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టీవీ9 తో పేర్కొన్నారు.
అయితే, సీపీఎం అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ్మినేనితో మాట్లాడారు. తమ్మినేని వీరభద్రంకు భట్టి విక్రమార్క ఫోన్ చేసి.. కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తులపై మరోసారి చర్చించారు. అభ్యర్థులను ప్రకటించవద్దంటూ భట్టి కోరగా.. తమకు ఇస్తామన్న స్థానాలపై నిర్ణయం తీసుకున్నారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని భట్టి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమయ్యాయని.. మీకే క్లారిటీ లేదంటూ తమ్మినేని భట్టితో పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రకటించాం.. ఇక ఆలోచించే అవకాశం లేదంటూ తేల్చి చెప్పారు. పొత్తులపై ఎందుకు తేల్చడం లేదు, అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యమెందుకు? అన్న ప్రశ్నకు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. జాతీయ నాయకత్వం చర్చిస్తుందని తెలిపారు.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ – సీపీఐ పొత్తు విషయం కూడా ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే.. సీపీఐ, కాంగ్రెస్ నాయకత్వాలు పలు దఫాలుగా చర్చించాయి. అయితే, మొదట చెన్నూర్, కొత్తగూడెం సీట్లు సీపీఐకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.. అయితే, చెన్నూరులో కాంగ్రెస్ నుంచి వివేక్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో సీపీఐకు కొత్తగూడెంతోపాటు.. ఒక ఎమ్మెల్సీ ఇచ్చే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి కూడా ఇరు పార్టీల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..