Telangana Election: ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరిది..?

| Edited By: Balaraju Goud

Nov 12, 2023 | 1:18 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చల్మెడు లక్ష్మీనర్సింహారావు, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి చెన్నమనేని వికాస్ రావు బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎంఎల్ఎ రమేష్ బాబు కాకుండా, చల్మెడ లక్ష్మీనర్సింహా రావుకు టికెట్ ఇచ్చారు గులాబీ దళపతి.

Telangana Election: ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరిది..?
Chelmedu Lakshmi Narasimha Rao, Adi Srinivas Rao, Chennamaneni Vikas Rao
Follow us on

దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు, ప్రచార దూకుడును పెంచుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గంలో రెండు విడతలుగా ప్రచారం చేశారు. అయితే.. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రచారంలో కాస్తా వెనుకబడింది. నామినేషన్ చివరి రోజు అభ్యర్థిని మార్చడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడిప్పుడే ప్రచారం పర్వంలో దిగింది కాషాయదళం. అయితేనేం, ఇక్కడ త్రిముఖ పోరు ఉండటంతో, గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చల్మెడు లక్ష్మీనర్సింహారావు, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి చెన్నమనేని వికాస్ రావు బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎంఎల్ఎ రమేష్ బాబు కాకుండా, చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు టికెట్ ఇచ్చారు గులాబీ దళపతి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్నారు.

అయితే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంది. అభ్యర్థి ఎంపికలో తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన బీజేపీ అధినాయకత్వం, మొదట తుల ఉమకు టికెట్ కేటాయించింది. తరువాత, చివరి నిమిషంలో తుల ఉమకు కాకుండా, చెన్నమనేని వికాస్ రావుకు బీపామ్ కట్టబెట్టింది. దీంతో బీజేపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. మరోవైపు తుల ఉమతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు.

ఇదిలావుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్ వరుసగా ఓడిపోతున్నారు. ఈసారి సానుభూతితో పాటు ప్రభుత్వ వ్యతిరేకత తనకు పని చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. బీసీ ఓట్లు తనకే వస్తాయనే నమ్మకంతో ఉన్నారు శ్రీనివాస్. ఇక్కడ పూర్తిగా బీసీ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెవెళ్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఓడిపోవడంతో, శ్రీనివాస్ పట్ల కొంత సానుభూతి కూడా ఉంది. దీన్నే ఓట్లుగా మలుచుకోవాని భావిస్తోంది కాంగ్రెస్.

బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మి నర్సింహారావు బరిలోకి దిగుతున్నారు. గత రెండు నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, చల్మెడకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో, ఎలాంటి అసమ్మతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. మరోసారి వేములవాడలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇక బీజేపీ తరుఫున చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు బరిలో ఉన్నారు. గతంలో ఈ ప్రాంతంలో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు వికాస్ రావు. స్వయాప వైద్యులు కావడంతో, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే అంటున్నారు వికాస్ రావు. గతంలో ఉన్న కోరుట్లు నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు, ఇప్పుడు వేములవాడలోకి వచ్చాయి. అంతేకాదు విద్యాసాగర్ రావుకు ఉన్న మంచి పేరు, తనకు కలిసి వస్తుందని ధీమాతో ఉన్నారు.

ఇదివుంటే ఇప్పటి వరకు అశలు పెట్టుకున్న తుల ఉమకు బీఫామ్ ఇవ్వకపోవడంతో, బీజేపీ విబేధాలు బయటపడ్డాయి. ఆమె కూడా బీజేపీ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమెకు క్యాడర్ సపోర్ట్ లేకపోవడంతోనే, పార్టీ అభ్యర్థి మార్చారని వికాస్ రావు అంటున్నారు.. అయితే, ఈ మూడు పార్టీలు గెలపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. రాజన్న ఆలయం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో బీఆర్ఎస్ విఫలమైందని, కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే.. ఆలయ అభివృద్ధి జరిగిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి వేములవాడలో రోజు రోజుకు రాజకీయాలు వేడేక్కుతున్నాయి. చూడాలి మరీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…