
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శం అని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు అన్నారు. వ్యవసాయ, సాగు, తాగునీటి, విద్యుత్ రంగాల్లో రాష్ట్రం ఎనలేని ప్రగతి సాధించిందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశరాజధాని ఢిల్లీలో జరిగిన హింసను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమనిపేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేశవరావు డిమాండ్ చేశారు.