CS somesh kumar meet CM KCR: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కోవిడ్ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పలు కీలక అంశాలపై అధికారుల నుంచి వివరాలను సోమేశ్ సేకరిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం బెడ్లు పెంచాలని సీఎస్ ఇదివరకే ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వ్యాక్పినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ కోరారు.
అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌తో సీఎస్ భేటీ కానున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనపై సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా పంట కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండే జాగ్రత్తలపై సీఎం దృష్టికి సీఎస్ తీసుకెళ్లనున్నారు.
మరోవైపు.. దేవాలయాల వద్ద రద్దీ, ఆలయాల్లో కరోనా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌తో సీఎస్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో కరోనా కట్టడిపై అప్రతమత్తత ఉండేలా సూచనలు తీసుకోనున్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం సీఎస్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.