Telangana Congress: ఠాక్రే రాకతో మారిన పరిస్థితి.. గాంధీభవన్‌లో ఐక్యతారాగం.. కాకరేపుతున్న కొండాసురేఖ డిమాండ్

|

Jan 21, 2023 | 8:48 PM

గాంధీభవన్‌లో కనిపించిన ఓ దృశ్యం కొందరికి ఆశ్చర్యంగాను, మరికొందరికి షాకింగ్‌గానూ తోచింది. ఇక గాంధీభవన్ మొహం చూడడు.. అసలు పార్టీలోనే కొనసాగడు అనుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్యంగా దిగివచ్చారు.

Telangana Congress: ఠాక్రే రాకతో మారిన పరిస్థితి.. గాంధీభవన్‌లో ఐక్యతారాగం.. కాకరేపుతున్న కొండాసురేఖ డిమాండ్
Follow us on

జనవరి 20వ తేదీన గాంధీభవన్‌లో కనిపించిన ఓ దృశ్యం కొందరికి ఆశ్చర్యంగాను, మరికొందరికి షాకింగ్‌గానూ తోచింది. ఇక గాంధీభవన్ మొహం చూడడు.. అసలు పార్టీలోనే కొనసాగడు అనుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్యంగా దిగివచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేను కలిసే పేరిట గాంధీభవన్‌కు వచ్చిన వెంకట్ రెడ్డి.. వచ్చి రావడంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎలాంటి భేషజాలు లేకుండా ఇద్దరు మాట్లాడుకున్న వీడియో ముందుగా వాట్సప్ గ్రూపుల్లోకి, ఆ తర్వాత మీడియా తెరలపైకి చేరింది. తొలుత కొందరు షాకయ్యారు. మరికొందరు ఆశ్చర్యపోయారు. ఇంకొందరు రాజకీయాల్లో ఇదంతా మామూలేనని, ఎప్పుడు మిత్రులు శతృవులు అవుతారో.. ఎప్పుడు శతృవులుగా భావించిన వారు మిత్రులవుతారో ఊహించడం కష్టమన్న కామెంట్లు పలు చోట్ల వినిపించాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రత్యర్థులు అనుకున్న వారిద్దరు కల్వడం.. ఆ తర్వాత వారిద్దరిని కలిసి పని చేయాల్సిందిగా ఠాక్రే కోరడం జరిగిపోయాయి. ఎవరికి ఎవరిపై ఎలాంటి అపోహలు, అభిప్రాయాలు వున్న తనతో మాత్రమే పంచుకోవాలని, మీడియాకు ఎక్కవద్దని ఠాక్రే చేసిన సూచన ఓరకంగా హెచ్చరికగానే భావించాలి. ఎన్నికలకు ఇంకా ఎంతో గడువు లేదు. ఇలాంటి కీలక సమయంలో పార్టీలో కీలక నేతలు తగవులాడుకుంటుంటే.. అది అంతిమంతా ఎన్నికల్లో పార్టీ ఫలితాలపై ప్రభావం పడుతుందన్న అంశాన్ని ఠాక్రే సీనియర్ నేతలందరికీ బహుచక్కగానే కన్వే చేసినట్లు అర్థం చేసుకోవాలి. అందుకే జనవరి 20, 21 తేదీల్లో గాంధీభవన్ భేటీల్లో కాస్త ఐక్యత కనిపించింది.

ఠాక్రే రాకతో మారిన సీన్

నిజానికి ఠాక్రే రాకతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ పాదయాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టాలని, ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కొన్నాళ్ళక్రితమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ తర్వాత దానికి ‘‘ హాత్ సే హాత్ జోడో ’’ అని కాంగ్రెస్ శ్రేణులు నామకరణం కూడా చేసుకున్నాయి. తెలంగాణలో ఈ పాదయాత్రను జనవరి 27వ తేదీన ప్రారంభించాలని తొలుత రేవంత్ రెడ్డి భావించారు. అయితే, ఆయన ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు సీనియర్లు అలక పూనారు. అందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా వుండడం విశేషం. జనవరి 27వ తేదీన ప్రారంభించ తలపెట్టిన పాదయాత్రను ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం నుంచి ప్రారంభించాలని రేవంత్ రెడ్డి భావించారు. భద్రాచలం వున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా రేవంత్ రెడ్డి ప్రారంభవేదికను ఖరారు చేశారంటూ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ రాక.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా వున్న మాణిక్కం ఠాగోర్‌ని మార్చేసి.. మాణిక్ రావు ఠాక్రే నియామకం.. ఆయన ఇప్పటికే రెండు విడతలుగా హైదరాబాద్ వచ్చి పార్టీ శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు భేటీలు నిర్వహించడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గతంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇపుడు పార్టీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్ని తీసుకువెళ్ళేలా వుండాలని తాజాగా నిర్ణయించారు.

కొండా కామెంట్స్‌తో మళ్ళీ కాక!

ముందుగా నిర్ణయించినట్లుగా జనవరి 27వ తేదీ నుంచి కాకుండా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీదాకా దీన్ని కొనసాగించాలని తాజాగా టీపీసీసీ నిర్ణయించింది. ఓరకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని, ఇది సీనియర్ల సమూహమని చాటేందుకు కొత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి‌ పాదయాత్రపై ఎన్నో ప్రచారాలు జరిగినా, సీనియర్ నేతలంతా పాదయాత్రలో పాల్గొనాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేవంత్ రెడ్డి ఒక్కరే కాకుండా సీనియర్లందరు కలిసికట్టుగా నడవాలని తేల్చి చెప్పింది. ఎన్నికల ఏడాదిలో పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరవడానికి పాదయాత్ర చేయాలని డిసైడ్‌ చేసింది. చేయి చేయి కలుపుదాం అధికారం సాదిద్దాం అన్నదే తెలంగాణ కాంగ్రెస్ నినాదం కావాలని ఠాక్రే పార్టీ వర్గాలు అర్థమయ్యేలా చెప్పారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగబోతున్న తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. రాహుల్‌ జోడో యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో.. ఆ యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసేలా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. అయితే జనవరి 26వ తేదీన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజు మండలాలు, డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్ర పార్టీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి పాదయాత్ర నిర్వహిస్తారు. ఇన్నాళ్లు రేవంత్‌ ఒక్కరే పాదయాత్ర చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్లు సైతం యాత్రలో పాల్గొనేలా నిర్ణయం జరిగింది. ప్రాంతాల వారీగా సీనియర్‌ నేతలు యాత్రలు చేయాలని తీర్మానించారు. ప్రారంభ కార్యక్రమానికి సోనియా లేదంటే ప్రియాంక రావాలని ఆహ్వానిస్తూ తీర్మానం చేశారు. విస్తృత స్థాయి సమావేశంలో నేతల తీరుపైనా హాట్‌హాట్‌ చర్చ జరిగింది. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని నేతలకు తేల్చిచెప్పారు ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే. సమస్యలు ఉంటే తనతో చెప్పాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే చర్యలు తప్పవని థాక్రే హెచ్చరించినట్లు చెప్పారు రేవంత్‌. ఇక్కడి వరకు అంతా బాగానే వున్నా.. మీటింగ్‌లో కొండా సురేఖ కామెంట్లు ఆసక్తి రేకెత్తించాయి. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారు సురేఖ. వ్యక్తిగత అంశాలను ఈ మీటింగ్‌లో చర్చించొద్దని సూచించారు రేవంత్‌రెడ్డి. బయటకొచ్చాక కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు కొండా సురేఖ. గతంలో రేవంత్ రెడ్డి నేరుగా కాకుండా అద్దంకి దయాకర్ వంటి నేతలతో తనను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా కొండా సురేఖ డిమాండ్‌పై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిరేపుతోంది. ఠాక్రే ఉన్నపుడు కనిపించిన ఐక్యత పాదయాత్ర నాటికి వుంటుందా అన్న అంశం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.